కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉద్యోగులందరు సమన్వయంతో పనిచేసినప్పుడే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా మార్కెట్లవారిగా పనుల పురోగతి, పత్తి మరియు మిర్చి పంటల కొనుగోళ్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనుల పురోగతి అంత ఆశాజనకంగా లేవని అన్నారు. ప్రతి నెలకోసారి పనుల పురోగతిని సమీక్షించి, నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఇప్పటిదాకా 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరణ లక్ష్యంగా పెట్టుకొని, 18 లక్షల మెట్రిక్ టన్నలు పత్తిని మద్ధతు ధరకు సేకరించామని అధికారులు తెలిపారు. వివిధ రకాల పంట ఉత్పత్తుల అమ్మకాలలో రైతుల పక్షాన ఉండి, వారికి గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు. రైతుల హక్కుల పరిరక్షించే బాధ్యత మార్కెటింగ్ శాఖ అధికారుల మీద ఉందని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి పనిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.