తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరినది నీటి ప్రవాహాన్ని శ్రీధర్‌బాబు పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, విపత్తును ఎదుర్కోడానికి తమ ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. తెలంగాణలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను అంచనా వేస్తూ వరదనీటిని అధికారులు ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారని తెలిపారు.