కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులను సన్మానించుకోవాల్సిన విద్యార్థులు.. చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరమని అన్నారు. తమ గురువులకు మద్దతుగా విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమని చెప్పారు. IIT, NIT, నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి నిలిచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను.. నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
విద్యా సంవత్సరం మధ్యలో 6 వేల 200 మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన సర్కారు నిర్ణయం వల్ల వేలమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి…? అంటూ ఎక్స్ వేదికగా హరీశ్ రావు ప్రశ్నించారు.