విశాఖలో మళ్లీ నిలిచిపోయిన ‘లులు’ మెగా ప్రాజెక్టు…. కోర్టు కేసులతో బ్రేక్‌

విశాఖపట్నంలో ‘లులు’ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌మాల్‌ ప్రాజెక్టు మళ్లీ ఆగిపోయింది. దీనిపై లెక్కకు మించిన కోర్టు కేసులు ఉండడమే కారణంగా తెలుస్తోంది. కొందరు ఆ భూమి తమదని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండగా, ఇంకొందరు విలువైన భూమిని ప్రభుత్వం తక్కువ ధరకు లీజుకు ఇచ్చిందని, ఇందులో ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కేసులు వేశారు. ఇప్పటికే బీచ్‌ ఏరియాలో సందర్శకులు పెరిగి రద్దీగా మారిందని, లులు షాపింగ్‌ మాల్‌ వస్తే ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోతాయని, ఆ భూమికి సమీప నివాసితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులపై స్టేలు రద్దయితే తప్ప భూమిని కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రాజెక్టు ఆగిపోయింది.

తెలుగుదేశం ప్రభుత్వం 2018లో లులు గ్రూపునకు బీచ్‌రోడ్డు హార్బర్‌ పార్క్‌ ఏరియాలో 13.74 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో ఏపీఐఐసీకి చెందిన భూమి 10.85 ఎకరాలు కాగా మిగిలిన భూమి సీఎంఆర్‌ గ్రూపు నుంచి సేకరించారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.2,200 కోట్లతో భారీ షాపింగ్‌మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మిస్తామని లులు యాజమాన్యం ప్రకటించింది. ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది.

వైసీపీ హయాంలో అడ్డంకులు

లులు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చి, భూ కేటాయింపును రద్దు చేసింది. ఆ భూమిని అమ్మకానికి పెట్టింది. బల్క్‌గా విక్రయిస్తే ఎవరూ రావడం లేదని గజాల లెక్కన ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ అంటూ నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌బీసీసీ)కి ఆ భూమిని అప్పగించి, వేలం వేయాలని కోరింది. దీనిపై విశాఖకు చెందిన కొందరు నాయకులు హైకోర్టులో కేసు వేయడంతో స్టే వచ్చింది. దీంతో జగన్‌ ప్రభుత్వం ఆ భూమిని వీఎంఆర్‌డీఏకి అప్పగించింది. ఆ సంస్థ కూడా భూమిని వేలం ద్వారా అమ్మాలని యత్నించింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

మళ్లీ కదిలిన ఫైల్‌

విశాఖలో అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు పర్యాటకులను ఆకర్షించేలా భారీ షాపింగ్‌మాల్‌ అవసరమని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లులు యాజమాన్యాన్ని ఒప్పించి విశాఖలో పాత భూమినే ఇస్తామని ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. దీనికి లులు యాజమాన్యం అంగీకరించింది. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేసి ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ లీజు వ్యవహారం

ఈ భూమిని 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. అందులో 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్‌మాల్‌, లులు సూపర్‌మార్కెట్‌, లులు ఫ్యాషన్‌ అండ్‌ కనెక్ట్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ నిర్మిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏడాదికి రూ.7.08 కోట్లు లీజు నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్‌గా మరో రూ.7.08 కోట్లు చెల్లించాలని సూచించారు. మొదటి మూడేళ్లు లీజు ఉండదని, 2028 నుంచి లీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రతి పదేళ్లకు పది శాతం లీజు పెంచాలని షరతు పెట్టారు. ఈ నిబంధనలతో గత ఏడాది అక్టోబరులో జీఓ ఇచ్చారు. అయితే లులు యాజమాన్యం పెట్టే పెట్టుబడి కంటే వారికి ఇచ్చిన భూమి విలువే ఎక్కువని, ఇది నష్టం కలిగించే ఒప్పందమని వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేయించారు. ఈ నేపథ్యంలో కోర్టు స్టేలు రద్దైతే తప్ప భూమి అప్పగించలేమని అధికారులు స్పష్టం చేయడంతో లులు మిన్నకుండిపోయింది. ప్రస్తుతం ఆ భూమి ఏపీఐఐసీ ఆధీనంలోనే ఉంది. దానిని ఎవరికీ కేటాయించలేదని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఏపీఐఐసీ అధికారి తెలిపారు

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్