కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్ తీర్థం పుచుకున్న ఆయన.. ఏడాది కూడా నిండకుండానే హస్తం పార్టీ నుంచి తప్పుకున్నారు. గతంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. తాజాగా సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో విభేదాల కారణంగా ఇప్పుడు హస్తం పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడి.. ఏ పార్టీలో చేరతారనే సస్పెన్స్ పై కూడా సమాధానం ఇచ్చారు. ఇక ముందు తాను ఏ పార్టీలోనూ చేరనని.. స్వతంత్రంగా కొనసాగుతానని ప్రకటించారు. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఆయన మద్దతు ప్రకటించారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతకొంత కాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కారు. సొంత పార్టీపైనే విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లైఓవర్‌ను.. రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేయడంపై కోనప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో కొత్త బిచ్చగాళ్లు తిరుగుతున్నారని.. వాళ్లకు అంత సీన్ లేదంటూ కోనప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లోకి వచ్చే నాయకులను గల్లా పట్టి నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎవరికీ భయపడనని.. గతంలో టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన విషయాన్ని కోనేరు కోనప్ప గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చాలా సార్లు ఫ్లై ఓవర్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినా.. ఏమాత్రం స్పందించలేదని కోనప్ప తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై గెలుపొందారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్లీ గెలిచారు. 2023లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో పరాజయం పొందారు. అయితే ఆ ఎన్నికల సమయంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో అలిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు.