బాలీవుడ్ హిరో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆయన నివాసంలోనే ఈ దాడి జరిగింది. అర్ధరాత్రి రెండున్నర సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి రెండుమూడుసార్లు కత్తితో పొడిచారు. ఈ దాడిలో గాయపడిన సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దుండగుల దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్ల లోతుగా గాయాలుకాగా.. వెన్నెముక పక్కన గాయం అయినట్లు డాక్టర్లు గుర్తించారు. సైఫ్‌కి డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు. సర్జరీ తర్వాతే ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమని డాక్టర్లు వెల్లడించారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించారు. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా… వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు.. దాడి చేయడానికి కారణమేంటనేది తెలియాల్సి ఉంది. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.