- భారీ బహిరంగసభ ద్వారా కేసీఆర్ సమరశంఖం
- సభకు హాజరుకానున్న ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు, యూపీ మాజీ సీఎం
- 100 ఎకరాల్లో 5 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు

భారతీయ రాష్ట్ర సమితి ఖమ్మం నుంచి సమరశంఖం పూరించబోతోంది. భారీ బహిరంగ సభ ద్వారా తన సత్తా చాటాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీల నేతలు పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఈ సభలో పాల్గొంటారు.

ఖమ్మం సభ ద్వారా.. బీఆర్ఎస్ ఎజెండా, విధివిధానాలపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అదే సమయంలో.. ప్రస్తుతం దేశ ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి? వారికోసం తీసుకురావల్సిన పథకాలేంటన్నది ప్రస్తావించనున్నారు బీఆర్ఎస్ అధినేత. ఆప్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ పార్టీల అధినేతలను ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్తులో వీరితో దోస్తీ ఉండబోతున్నట్టు సంకేతాలనిస్తున్నారు.

బీఆర్ఎస్ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. వంద ఎకరాల్లో సభ.. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు..5 లక్షల మంది జనసమీకరణ టార్గెట్‌గా పెట్టుకున్నారు.. మొత్తం వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. హైదరాబాద్ నుంచి అతిథులతో కలిసి 2 హెలికాఫ్టర్లలో మొదట యాదాద్రికి వెళ్తారు కేసీఆర్. యాదాద్రీశుని దర్శనం తర్వాత నేరుగా ఖమ్మం చేరుకొని నూతన కలెక్టరేట్‌ను, రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సభావేదికపై ముఖ్య అతిథులతోపాటు.. ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు మాత్రమే ఉంటారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కూర్చుంటారు.

సభకు వచ్చే ప్రముఖులకు తెలంగాణ వంటకాలతో అద్భుతమైన విందు ఇవ్వనున్నారు. అతిథులకు అచ్చ తెలంగాణ వంటకాల రుచి చూపించేందుకు.. మెనూ రెడీ చేశారు. మొత్తం 38 రకాల వంటకాలను వడ్డించనున్నారని సమాచారం. వంటకాలలో 17 రకాల నాన్‌వెజ్, 21 రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయి.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీఆర్ఎస్ సభా వేదిక పైకి సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల సీఎంలు, అఖిలేష్ యాదవ్ చేరుకుంటారు. బారత రాష్ట్ర సమితి సభ ముగిసిన తర్వాత భారీ క్రాకర్ షో ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు.