భారత జట్టుకి ఈ రకమైన ఆట తీరు ఒక బలహీనతలా మారిపోయిందేమో అర్థం కావడం లేదు. జట్టుని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. కెప్టెన్లని మార్చుతున్నారు.యువతకి అవకాశాలు ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నా సిరీస్ లను మాత్రం ఏకపక్షంగా భారతజట్టు గెలవలేకపోతోంది. మూడు వన్డేలు ఉంటే అందులో వీరు ఒకటి గెలుస్తారు, వారొకటి గెలుస్తారు. మూడోది టెన్షన్…తర్వాత 130 కోట్ల మంది భారతీయుల బలహీనతలతో వారు ఆటలు ఆడుతారు.
వీరు పిచ్చివాళ్లలా టీవీలు ముందు కూర్చుంటారు. పోనీ ఆ మ్యాచ్ అయినా సీరియస్ గా ఆడతారా? అంటే అదేం లేదు. ఏదో లోకల్ మ్యాచ్ ఆడుతున్నంత ఈజీగా గ్రౌండ్ లో ఉంటారు. ఒక్కరిలో సీరియస్ నెస్ ఉండదు. గెలవాలన్నా కాంక్ష ఉండదు. పట్టుదల ఉండదు. టీమ్ స్పిరిట్ ఉండదు.
ఏదైనా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నప్పుడే, ఆ కసి, ఆ పట్టుదల టీమ్ స్పిరిట్ కనిపించేది. సౌరవ్ గంగూలి, ధోనీ ఇద్దరి కెప్టెన్లలో భారతీయ క్రికెట్ కు స్వర్ణయుగం అని చెప్పాలి. ప్రతి వన్డే కూడా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడటమే. ఒక యుద్ధమే. ఆ పోరాట స్ఫూర్తి ఇప్పుడు కనిపించడం లేదన్నదే బాధ. నిజానికి వారి కెప్టెన్లలో ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా, పోరాడి ఓడిపోయారనే సానుభూతి ఉండేది. ఇప్పుడది లోపించిందనేదే బాధ.
ఇటీవల కాలంలో చూస్తే…మొన్న టీ 20 వరల్డ్ కప్ అలాగే చేశారు. మొదట్లో బాగా ఆడి, సరిగ్గా కీలకమైన మ్యాచ్ లో అది గెలిస్తేనే ఫైనల్ కి వెళతాం అన్న మ్యాచ్ లో చేతులెత్తేస్తున్నారు. కప్ వదిలేసి చక్కగా వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కూడా అలాగే కోల్పోయారు. తర్వాత చివరి మ్యాచ్ లో ఇరగ్గొట్టి వచ్చారు. మన భారతీయ క్రికెటర్ల కెరీర్ నిండా రికార్డులకి కొదవలేదు. కానీ చివరి వరకు ఒక సిరీస్ లో పోరాడి, ఒక క్రీడా స్ఫూర్తితో జట్టంతా కలిసి కట్టుగా సాధించి తీసుకు వచ్చిన కప్పులు ఎక్కువ ఉండవనేది ఒక చేదు నిజం.
నాడు సునీల్ గవాస్కర్ నుంచి మొదలు…భారత జట్టులో దిక్కుమాలిన రాజకీయాలు…వారి ఆట వారు ఆడుకోవడమే… జట్టు కోసం సమష్టిగా ఆడటం అనేది ఉండేది కాదు. మళ్లీ సౌరవ్ గంగూలి వచ్చిన తర్వాత నీ కోసం కాదు… దేశం కోసం ఆడాలి, దేశం మీద ప్రేమతో ఆడాలి…అనే కాన్సెప్ట్ వచ్చింది. అదే మహేంద్ర సింగ్ ధోనీ వచ్చాక భారత జట్టు స్వరూపమే మారిపోయింది. భావి తరం ఆటగాళ్లను మూడు ఫార్మాట్లకు అనువుగా ఇప్పటి నుంచే క్రీడాకారులను తయారుచేసుకోవాలనే స్ప్రహ వచ్చింది. అందరికీ అవకాశాలివ్వాలనే భావన వచ్చింది.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మనం ఫస్ట్ వన్డే గెలిచాం. రెండోది అప్పగించాం. ఇప్పుడు మూడోది ఆడాలి. ఇక్కడ జట్టు ఎంపికలో ఎన్నో లోపాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఒకేసారి ముగ్గురు సీనియర్లకు చెక్ పెట్టకుండా ఒక్కరినైనా ఉంచితే బాగుండేది. వరుసగా వికెట్లు పడుతుంటే, మరో ఎండ్ లో సీనియర్లు కాసుకుంటూ ఉంటారు. కొహ్లీ ఫామ్ లోనే ఉన్నాడుకదా…తనని అనవసరంగా తప్పించారు. తర్వాత మళ్లీ తీసుకుంటారు. అప్పటికి ఫామ్ పోతే, మళ్లీ ఇబ్బందే…రాహుల్, రోహిత్ ఇద్దరికి ఫామ్ లేదు కాబట్టి సమస్య లేదు. ఒక సీనియర్ జట్టుతో ఉండటం వల్ల, గ్రౌండులో ఉండటం వల్ల కెప్టెన్ కి ఎంతో లాభం ఉంటుంది.
దేశం కోసం ఆడాలి, టీమ్ స్పిరిట్ తో ఆడాలి అని నేర్పించిన సౌరవ్ గంగూలి, ధోనీ బాటలో నేటి యువ భారత జట్టు నడిస్తే, వారి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పాలి.