24.2 C
Hyderabad
Monday, September 25, 2023

ఏపీలో కాపులను కారెక్కించే వ్యూహంలో కేసీఆర్‌

– ఇప్పటికే ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కాపు నియామకం
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వియ్యంకుడు కూడా బీఆర్‌ఎస్‌లో
– జనసేనను బలహీనపరిచే వ్యూహమేనంటున్న బీజేపీ నేత కన్నా
– కేసీఆర్‌ వ్యూహాలన్నీ జగన్‌ మేలుకోసమేనని కన్నా ఆరోపణ
– కాపుల ఓట్లు చీల్చి జగన్‌కు మేలు చేయాలన్న కేసీఆర్‌ కుట్రలు సాగవని హెచ్చరిక
– తోట నియామకంతో తెలంగాణలో మున్నూరు కాపులను మెప్పించే వ్యూహం
– తెలంగాణలో మున్నూరు కాపులను బీజేపీ నుంచి దూరం చేసే ప్లాన్‌ ఫలిస్తుందా?
– అటు జనసేన, ఇటు బీజేపీపై కేసీఆర్‌ ‘కాపు తంత్రం’ ఫలిస్తుందా?
– ఏపీలో చేరిన కాపు నేతలకు అంత సీన్‌ ఉందా?
– జిల్లా స్థాయి నేతలతో కేసీఆర్‌ వ్యూహం నెరవేరుతుందా?
– కేసీఆర్‌ అంచనాలు అడ్డం తిరుగుతాయంటున్న కాపు నేతలు
– జనసేనతో కాపు బంధం తెంపడ ం సాధ్యమేనా?
– పవన్‌ను కాదని కాపులు కారెక్కుతారా?
– కాపులను ఏకం చేసే శక్తి బీఆర్‌ఎస్‌కు ఉందా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన బీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం?
జనసేన పీఏసీ మెంబర్‌, కాపునేత తోట చంద్రశేఖర్‌ సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వియ్యంకుడు, కాపునేత పార్ధసారథి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
బలిజ నేత ప్రకాష్‌ సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
– ఇవన్నీ చూస్తే.. ఏపీ-తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఎవరు ఎవరితో కలసి నడుస్తున్నారు? ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఎవరు ఎవరితో తెరచాటు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారు? అసలు ఆంధ్రా-తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అన్న సందేహాలు రావడం సహజం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న చర్చ ఇదే.

ఏపీలో కాపు నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడం ద్వారా.. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నది, కేసీఆర్‌ వ్యూహమన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ. అంటే జనాకర్షణ నేత పవన్‌ జనసేనను బలహీనపరిచేందుకే.. ఆంధ్రా కాపులను బీఆర్‌ఎస్‌లోకి తీసుకువస్తున్నారన్న కొత్త చర్చ, అటు జనసేనలోనూ హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంకో వైపు బీఆర్‌ఎస్‌, మాజీ ఎంపీ పొంగులేటిని వైసీపీ అధినేత జగన్‌ బీజేపీలోకి పంపిస్తున్నారన్న మరో చర్చ, ఇటు బీఆర్‌ఎస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పొంగులేటికి ఉన్న సెక్యూరిటీని తగ్గించిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. పొంగులేటి రాకతో ఖమ్మం జిల్లాలో కమలం వికసిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.

అయితే..బీఆర్‌ఎస్‌ నేతల ఆశలు, ఊహలు, అంచనాలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ వ్యూహాలు ఆంధ్రాలో ఫలిస్తాయా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. జనాభాలో 24 శాతం ఉన్నప్పటికీ, సీఎం కాలేకపోతున్నామన్న కాపు-బలిజల అసంతృప్తిని, కేసీఆర్‌ క్యాష్‌ చేసుకుంటారన్నది బీఆర్‌ఎస్‌ వర్గాల విశ్లేషణ. అంటే ఆ ప్రకారంగా బీఆర్‌ఎస్‌ కనీసం 70 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. ఆ అసంతృప్తి నిజమే అయినప్పటికీ, కాపులు జనసేన గొడుగు నుంచి బయటకు వస్తారా? అన్నదే అసలు ప్రశ్న.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. తనకు కులం లేదని పవన్‌ కల్యాణ్‌ ఎంత చెప్పినా.. జనసేనకు కాపులే దన్ను. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్రలో కాలుపెట్టిన వారికి, ఇవి కనిపించే దృశ్యాలే. విశాఖలో పవన్‌ను జగన్‌ సర్కారు అవమానించిన ఘటన తర్వాత, కాపుల్లో పట్టుదల మరింత పెరిగింది.

రానున్న ఎన్నికల్లో.. టీడీపీ-జనసేన కలసి పోటీ చేయటం ఖాయమన్న సంకేతాలు స్పష్టమైన నేపథ్యంలో, జనసేనను వీక్‌ చేసే వ్యూహాలకు కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ద్వారా పదునుపెట్టడమే, రాజకీయవర్గాలను విస్మయపరుస్తోంది. ఆ క్రమంలో జగన్‌ పార్టీకి మేలు చేసేందుకే, ఏపీ నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకువస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేనలోని కాపు నేతలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడం ద్వారా, జనసేనను నిర్వీర్యం చేయాలన్నదే కేసీఆర్‌ ఎత్తుగడ అని, అటు బీజేపీ నేతలు సైతం అనుమానిస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణలో ముదిరాజుల తర్వాత, బలమైన బీసీ వర్గమైన మున్నూరు కాపులలో చీలిక తెచ్చేందుకే.. కాపు అయిన తోటచంద్రశేఖర్‌కు ఏపీ అధ్యక్ష పదవి ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. నిజానికి బండి సంజయ్‌ బీజేపీ అధ్యక్షుడు, డాక్టర్‌ లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా అధ్యక్షుడితో పాటు ఎంపీ పదవి ఇచ్చిన తర్వాత, మున్నూరు కాపులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

పైగా సీనియర్లు తనకు సహకరించినా, సహకరించకపోయినా బండి సంజయ్‌ .. బీఆర్‌ఎస్‌ సర్కారుపై దూకుడుగా వెళుతున్న వైనం కూడా, ఆ సామాజికవర్గాన్ని మెప్పించింది. ఈ క్రమంలోనే తమకు కాపులపై ప్రేమ ఉందని చెప్పడానికే, ఏపీలో కాపు నేతకు బీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఇచ్చి, తెలంగాణ కాపులను ఆకర్షించేందుకు కేసీఆర్‌ కొత్త ఎత్తు వేశారని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాపు నేత, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం, ఇలాంటి అనుమానమే వ్యక్తం చేయడం గమనార్హం. కేసీఆర్‌-జగన్‌ కలసి జనసేనను వీక్‌ చేసే కుట్రలో భాగంగానే, కాపు నేతల చేరికలని కన్నా విశ్లేషించారు. కేసీఆర్‌-జగన్‌ కుట్రను అడ్డుకుని, పవన్‌కు దన్నుగా నిలుస్తామని కన్నా స్పష్టం చేశారు. దానితోపాటు కాపులెవరూ.. బీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో పడవద్దన్న కన్నా పిలుపు, కాపు సామాజికవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ కాపు వ్యూహం బాగానే ఉన్నప్పటికీ.. ఆయన ఎత్తుగడ ఫలించడం కష్టమని, కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. అసలు ఏపీలో ప్రజలు జగన్‌-చంద్రబాబునే చూస్తున్నారు తప్ప, మిగిలిన వారెవరూ పోటీలో ఉండటం అసాధ్యమంటున్నారు. ఇప్పటికి టీడీపీ-జనసేన కలసి పోటీచేస్తాయన్న ప్రచారం ఉధృత ంగా జరుగుతున్నందున, కాపులు కూడా అటువైపే నడుస్తారని విశ్లేషిస్తున్నారు.

కొత్త పార్టీలు వచ్చినా, ఆ రెండు పార్టీలో ఏదో ఒక దానితో కలసి పోటీ చేయాల్సిందేనని, కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. బహుశా కేసీఆర్‌కు ఏపీ కుల రాజకీయాలపై అవగాహన లేకనో, ఎవరైనా ఇచ్చిన నివేదిక ప్రకారమో అడుగులేస్తూ ఉండవచ్చని, కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి మేలు చేయాలన్న తొందరలో, కేసీఆర్‌ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్‌, పార్ధసారధి వంటి నేతలు.. కాపు కులానికి చెందిన వారే అయినప్పటికీ, వారికి తమ కుల సంఘాలతో గానీ, నాయకులతో గానీ ఎలాంటి సంబంధబాంధవ్యాలు లేవని కాపు నేతలు కుండబద్దలు కొడుతున్నారు. వాళ్లకు కాపు ఉద్యమాలు చేసిన నేపథ్యం లేదంటున్నారు.

‘వాళ్లతో కేసీఆర్‌ కలలు పండటం కష్టం. ఇప్పటికే జగన్‌కు మేలు చేసేందుకే కేసీఆర్‌ కాపులను తీసుకుంటున్నారన్న భావన కాపుల్లో ఉంది. బీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లను చూసి, కాపులెవరూ ఆ పార్టీలో చేరరు. కాపులను చీల్చేందుకు వస్తున్న బీఆర్‌ఎస్‌కు కాపులు ఏవిధంగా ఓట్లు వేస్తారు? ఏదో ఇద్దరు ముగ్గురు కాపులు ఆ పార్టీలో చేరినంత మాత్రాన, కాపులంతా బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తారా? కేసీఆర్‌ చాలా తెలివైన నేత, వ్యూహకర్త అంటారు. కానీ ఆయన ఎంపిక అందుకు భిన్నంగా ఉందని’ కాపు నేత ఒకరు వ్యాఖ్యానించారు.

నిజానికి ముద్రగడను కొన్ని దశాబ్దాల కాలం నమ్మిన కాపులు, ఇప్పుడు ఆయనను నమ్మడం మానేశారని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం గతంలో, నానా యాగీ చేసిన ముద్రగడ.. ఇప్పుడు మౌనంగా ఉండటం ఆయన విశ్వసనీయత దెబ్బతీసిందంటున్నారు. గతంలో పాలకులను బెదిరించిన ముద్రగడ ఇప్పుడు.. కాపు జాతి తలదించుకునేలా సీఎం జగన్‌కు, దీనంగా లేఖలు రాస్తున్నారన్న విమర్శలు కాపు సంఘాల్లో వినిపిస్తున్నాయి.

ఇక వైసీపీలోని కాపులను నమ్మేపరిస్థితి లేదంటున్నారు. పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, చేగొండి హరిరామజోగయ్య, కొంతలో కొంత వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులువంటి కొద్దిమందిని మాత్రమే కాపులు నమ్ముతున్నారని ఓ కాపునేత విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితిలో కాపుజాతిలో వీరికి తప్ప మరెవరికీ ఇమేజ్‌ లేదని స్పష్టం చేస్తున్నారు.

అసలు కాపులు జనసేనను విడిచిపెట్టే అవకాశమే లేదని, మెజారిటీ కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ అంటే ఇష్టం ఉన్నా, లేకపోయినా.. ఈసారి కాపులంతా జనసేనతోనే ఉంటారని, కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీతో కలసి నడుస్తారని చెబుతున్నారు. అయితే గుంటూరు-కృష్ణా జిల్లాల్లోని కాపులు మాత్రమే.. జనసేన-టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రెండు పార్టీలూ కలసిపోటీచేయాలన్న భావన ఉందంటున్నారు.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్