20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

బీసీ రిజర్వేషన్ల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా- సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాజకీయం గత కొంతకాలంగా కులగణన సర్వే చుట్టూ తిరుగుతోంది. సమగ్ర సర్వే తప్పుల తడక అని బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆరోపణలు చేస్తోంది. నివేదికలో బీసీల సంఖ్యను తగ్గించారని విమర్శలు చేశాయి. దీంతో ప్రభుత్వం కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీసీ నేతలదేనని అన్నారు. తప్పు తప్పు అని బిఆర్ఎస్ , బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని… ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని బీజేపీ, బిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారాయన. రాష్ట్ర పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాల ఉచ్చు లో పడొద్దని సూచించారు. బీసీలు మౌనం గా ఉంటే మీకే నష్టమని చెప్పారు. బీసీలు నిలదిస్తే.. తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్‌లోని ఓ రెండు వర్గాల వారు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా రేవంత్‌ రెడ్డి మాట్లడుతూ.. ” కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం.

దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదు. అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్ప..ప్రజల కోసం వినియోగించలేదు. కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించాం. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించాం. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించాం.

తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇది బీసీ సోదరులు గమనించాలి. స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు.

దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తుంది. కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే…కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం. ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి. గుజరాత్‌లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ బండి సంజయ్.. రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.

భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు.నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్నా. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం. ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం…దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే.

బీజేపీకి నేను సవాల్ విసురుతున్నా… మీరు జనగణనలో కులగణన చేర్చండి.. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాం. సామజికవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయండి. మీ ఐకమత్యాన్ని చాటండి…అప్పుడే మీకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్”.. అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్