పుస్తక ప్రియులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో..37వ బుక్ ఫెయిర్ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను సొసైటీ సభ్యులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెల్లడించారు. పబ్లిషర్స్ ఈసారి దాదాపు 300 పైచిలుకు స్థాళ్లలో తమ బుక్‌ను ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పారు. అదే విధంగా 8 నుంచి 10 లక్షల మంది బుక్ ఫెయిర్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. స్టాల్స్ నిర్వహించాలనుకునేవారు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నేరుగా కలవలేనివారు ఆన్‌లైన్ ద్వారా కూడా సంప్రదించవచ్చని చెప్పారు. ఈసారి వార్తాపత్రికల స్టాల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల స్టాళ్లకు కూడా అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తుల స్వీకరణ తరువాత జరిగే డ్రా విధానాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేస్ బుక్ లైవ్‌లో చేపడుతామన్నారు. అంతకుముందు బుక్ ఫెయిర్‌కు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బుక్ ఫెయిర్ సలహాదారులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ రమా మేల్కొటే హాజరయ్యారు.