ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక విజయసాయి రెడ్డిపై అనేక అరోపణలు వచ్చాయి. ఒకటి రెండు కాదు… ఏ అక్రమార్జన గురించి ప్రస్తావన వచ్చినా ఓ వేలు విజయసాయి రెడ్డి వైపే చూయించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాలుగైదు నెలల పాటు విజయసాయి టార్గెట్‌గానే ప్రభుత్వ చర్యలు కనిపించేవి. కొన్ని రోజులుగా విజయసాయిపై ఆరోపణలు ఆగిపోయాయి. కేసుల భయానికి సైలెంట్ అయిపోయాడా…? కూటమికి లొంగిపోయాడా…? టీడీపీతో విజయసాయి సంధి చేసుకున్నాడా…? విజయసాయికి సంధి కుదిర్చింది ఎవరు…
వైసీపీ ఏర్పాటు నుంచి నిన్న మొన్నటి వరకు నెంబర్ 2 కోసం విజయసాయి రెడ్డి విశ్వప్రయత్నాలే చేశాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన విజయసాయి రెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి చిన్న మచ్చ వచ్చినా మీడియా ముందుకు వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసే వారు. పార్లమెంటరీ పక్షనేతగా జగన్ సైతం ఆయనకి మంచి గౌరవమే ఇచ్చారు. జగన్ అండ.. పార్లమెంటరీ పార్టీ పక్షనేతగా ఉండటంతో అందిన కాడికి దోచుకున్నాడు.
వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు తాను ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లు సాగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అదేస్థాయిలో విజయసాయి రెడ్డి పార్టీకి గానీ.. జగన్‌కి కానీ మచ్చ రానీయకుండా విశ్వప్రయత్నాలే చేశారు. విజయసాయి రెడ్డిని సైలెంట్ చేయాలనుకున్న కూటమి నేతలు ఆయన బిజినెస్‌లపై కన్నేశారు. ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా విజయసాయి రెడ్డి అక్రమాలను మీడియా ముందు ఉంచారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జీగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున కబ్జాలకు తెగబడ్డారు. విశాఖ బీచ్‌ను కబ్జా చేసేందుకు ఆయన తెగబడిన వైనం వెలుగులోకి వచ్చింది. అలా కబ్జా చేసేందుకు భీమిలీలో బీచ్‌కి అడ్డంగా రిటైనింగ్ వాల్ తరహాలో కట్టిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేశారు.
విశాఖపట్నంలో విలువైన ఆస్తులపై కన్నేసిన విజయసాయి రెడ్డి… ప్రేమ సమాజానికి సంబంధించిన ఆస్తులను సైతం చేజిక్కించుకునేందుకు ప్లాన్ వేశాడు. విశాఖ బీచ్ రోడ్‌లో 30 ఎకరాల భూమి ప్రేమ సమాజం పేరిట ఉంది. ఆ భూమిని ఓ రిసార్ట్స్ వాళ్లు ప్రేమ సమాజం వద్ద లీజుకు తీసుకున్నారు. 30 ఎకరాలకు గాను చాలా తక్కువ అద్దె చెల్లిస్తున్నారని శాంతి దృష్టికి తీసుకెళ్లి… ఆ భూమిని కొట్టేయాలని విజయసాయి చూశాడు. నాడు దేవాదాయశాఖ అధికారిణిగా ఉన్న శాంతి… రిసార్ట్ వాళ్లను అద్దె పెంచాలని హుకుం జారీ చేసింది. దీంతో తమకు ఆ భూములు వద్దంటూ సదరు రిసార్ట్ వాళ్లు 30 ఎకరాలు వెనక్కి ఇచ్చేశారు. అక్కడ వరకూ అంతా వారు అనుకున్నట్టే జరిగింది. అనాథ శరణాలయాలు, గోశాలల నిర్వహణ భారంగా మారడంతో… మాకెందుకు ఈ తంటా మీరే చూసుకోండి… అంటూ ఏవో సెక్షన్లు చూపించి మళ్లీ తిరిగి వెనక్కి ఇచ్చేశారు.
తాను విదేశాల్లో ఉండగా తన భార్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భవతి అయిందని… ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పైగా, తన భార్య గర్భానికి విజయసాయి రెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఎక్కడ చూసినా రసవత్తర చర్చ సాగింది. పైగా… ఈ అంశం అప్పట్లో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన శాంతి భర్త మదన్ మోహన్… మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ తనను మోసం చేశారని ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని వదలొద్దన్నాడు.
కాకినాడ సీ పోర్ట్, సెజ్‌లోని వాటాలు బలవంతంగా అరబిందో రియాలిటీ అండ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. కాకినాడ సెజ్‌లోని విలువైన ఆస్తులను అరబిందోకు బదలాయించారని కేవీరావు సీఐడీకి గతేడాది ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ ఆస్తులపై ఫోకస్ పెట్టింది. ఈడీ సైతం కాకినాడ పోర్టు వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చింది. ఓ వైపు సీఐడీ, మరో వైపు ఈడీ ఉచ్చు బిగుస్తుండటంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది. కేవీ రావు నుంచి తీసుకున్న వాటాలను తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయి రెడ్డిపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. పక్షం రోజులకు ఓ ఆరోపణ ఆయనపై వస్తూనే ఉంది. తనపై కావాలనే కుట్ర పన్నారని ఇది పార్టీలోని వారి పనే అంటూ అప్పట్లో అంతెత్తున లేచి పడ్డాడు విజయసాయి రెడ్డి. ఛానల్ పెట్టి వారి భాగోతాలన్నింటిని బయట పెడతా అని హెచ్చరించాడు కూడా. రోజులు గడుస్తున్నాయి కానీ కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదు. ఇక ఛానల్ పెడదామని ప్రయత్నించినా… గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా ఎందుకు తెచ్చుకోవడం అని అనుకున్నట్లు ఉన్నాడు విజయసాయి. చేసేదేమి లేక టీడీపీతో ములాఖత్ అయిపోయాడని విశాఖ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
విశాఖలో విజయసాయి భూ దందాలు, కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో విజయసాయి టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అల్లుడిని కేసు నుంచి తప్పించేందుకు కాకినాడ సీ పోర్ట్, సెజ్‌లోని వాటాలను కేవీరావుకు ఇచ్చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దేవాదాయ శాఖ మాజీ అధికారణి శాంతి, విశాఖ భూములు, ప్రేమ సమాజం ఆస్తులపై కూటమి నేతల నుంచి ఈ మధ్య ఎలాంటి విమర్శలు రాలేదు. కాకినాడ పోర్టు ఒక్కటి సెటిల్ చేసుకుంటే అయిపోతుందన్న సూచన మేరకే విజయసాయి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా విజయసాయి వ్యవహారం…. కూటమి నేతల తీరు చూస్తే ఆ ప్రచారానికి బలం చేకూరుతుంది. కేసుల భయానికి విజయసాయి టీడీపీకి సరెండర్ అయిపోయాడని విశ్లేషకులు చెబుతున్నమాట. ఇందుకు తన బంధుత్వం కూడా సహకరించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.