28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

తెలుగుదేశంలో తగ్గని ముఠాల మఠాలు

– బాబు, లోకేష్‌ పర్యటనల్లో బిజీ
– వారి పర్యటనలకు జనస్పందన
– జిల్లాల్లో తగ్గని నేతల జగడాలు
– ఎన్నికలు సమీపిస్తున్నా ఏకాభిప్రాయం శూన్యం
– గంటా రాకపై అయ్యన్న విసుర్లు
– అయ్యన్న వ్యాఖ్యలపై పెరుగుతున్న మద్దతు
– కృష్ణా జిల్లాల్లో కేశినేనితో నేతల యుద్ధం
– ఇంకా ఇన్చార్జిలు వేయని నియోజకవర్గాల్లో కొట్లాటలు
– గుంటూరు జిల్లాల్లో నేతల వెన్నుపోటు రాజకీయాలు
– యరపతినేనికి చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్ధుల వ్యూహం
– ఎన్‌ఆర్‌ఐల రంగప్రవేశంతో సీనియర్ల అసంతృప్తి
– పార్టీ ఆఫీసులో కనిపించని ఆత్మీయ వాతావరణం

( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికార పార్టీపై అలుపెరుగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు ఇంకా కొలిక్కిరాలేదు. అగ్రనేతల మధ్య సమన్వయం కనిపించకపోవడం, ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించకపోవడంతో ..పెరుగుతున్న అంతర్గత సమస్యలు, నాయకత్వానికి తలనొప్పిలా పరిణమిస్తున్నాయి. రాయలసీమలో మినహా, మిగిలిన ప్రాంతాల్లో అగ్రనేతల మధ్య, వర్గవిబేధాలు ఇంకా సమసిపోకపోవడం తెలుగుతమ్ముళ్లను కలవరపెడుతోంది.

పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ రాష్ట్ర పర్యటనల్లో ఉన్న సమయంలోనే అగ్రనేతలు రోడ్డెక్కడం, పార్టీ నాయకత్వాన్ని ఆందోళనపరుస్తోంది. మరో ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో, అగ్రనేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు, టీడీపీని రోడ్డున పడేస్తున్నాయి.తాజాగా కృష్ణా, విశాఖ జిల్లాల్లో రచ్చకెక్కుతున్న విబేధాలు, టీడీపీ నాయకత్వానికి శిరోభారంగా మారాయి. ప్రధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి చర్చనీయాంశమయింది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన విద్యాశాఖతో పాటు, విశాఖను శాసించిన గంట పార్టీ ఓడిన తర్వాత, ముఖం చాటేశారు. టీడీపీ పార్టీ ఆఫీసుకు రావడం మానేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల మీటింగుకు వెళ్లలేదు. చివరకు అసెంబ్లీ సమావేశాలకూ, హాజరుకాకపోవడం చర్చనీయాంశమయింది. ‘‘ఎవడండీ ఈ గంటా?లక్షల్లో వాడొక్కడు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా? ప్రధానమంతా?పార్టీలో అందరూ రావాలి. పనిచేయాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని, ఎన్నికలొస్తున్నాయని మళ్లీ వస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవనివారిని చూస్తే తనకు బాధేస్తుంద’’ని గంటాపై అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్య టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.

గత నాలుగేళ్ల నుంచి పార్టీతో పెద్దగా సంబంధాలు లేని గంటా, ఇటీవల లోకేష్‌తో భేటీ కావడం, పార్టీ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. అసెంబ్లీ సమావేశాలు, విశాఖలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గంటా.. ఎన్నికల ముందు లోకేష్‌ను కలవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ ఆఫీసు నుంచి, చంద్రబాబు నాయుడు కార్యదర్శి వరకూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించని గంటాను, మళ్లీ చేరదీయడాన్ని పార్టీ వర్గాలు సైతం స్వాగతించలేకపోతున్నాయి.

గంటాకు ఆ స్థాయి ప్రాధాన్యం ఇచ్చి తప్పు చేసిన నాయకత్వం, మళ్లీ ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో వ్యక్తులకు స్థానం లేదని, పదే పదే చెప్పే చంద్రబాబు మాటల్లో.. నిజం లేదన్న విషయం గంటా భేటీతో నిజమయిందని, విశాఖకు చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల నుంచి విశాఖ కేంద్రంగా ఎన్నో పార్టీ కార్యక్రమాలు జరిగినా, ఒక్కదానికీ గంటా హాజరుకాని విషయాన్ని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.

చివరకు చంద్రబాబుకు అవమానం జరిగిన రోజు కూడా గంటా కనిపించలేదని, అప్పుడు తామే బాబు కోసం పోరాడామని గుర్తు చేస్తున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమాలు, వైసీపీ నేతల భూ దందాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల్లో, గంటా ఎక్కడ పాల్గొన్నారని నిలదీస్తున్నారు. గంటా ఎక్కడ ఏ సీటు కావాలంటే… ఆ సీటు ఇచ్చి ప్రోత్సహించిన నాయకత్వానికి, ఆయనతో ఇన్ని అనుభవాలయినా ఇంకా ప్రోత్సహించడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. చివరకు పార్టీ అనుమతి లేకుండా.. స్పీకర్‌కు రాజీనామా ఇచ్చినప్పటికీ, పార్టీ పట్టించుకోకపోవడంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

గంటా వైసీపీ, బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు, పార్టీ నాయకత్వానికి తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో చర్చించిన వైనం, మీడియాలో వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో చేరేందుకు గంటా చేసిన ప్రయత్నాలను.. అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యతిరేకించిన వైనం, మీడియాలో వచ్చినప్పటికీ.. అది తమ పార్టీ నాయకత్వానికి తెలియకపోవడమే వింతగా ఉందని, టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పార్టీల్లో దారులు మూసుకుపోవడంతోనే, గంటా తిరిగి పార్టీలో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయనపై, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదంటున్నారు. సగటు కార్యకర్త మనోభిప్రాయాన్నే, అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారంటున్నారు.

టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు జిల్లా అయిన కృష్ణాలో , ఎంపీ కేశినేని నాని- ఆయన తమ్ముడు చిన్ని మధ్య, మాటల యుద్ధం జరుగుతోంది. ఎంపీ కేశినేనికి వ్యతిరేకంగా.. మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెరవెనుక గూడుపుఠాణి నడిపిస్తున్నారన్నది కేశినేని మద్దతుదారుల ఆరోపణ. తన తమ్ముడికి మద్దతునిచ్చే ప్రశ్నే లేదని, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, పేకాట క్లబ్బులు, డాఫర్‌గాళ్లకు తన మద్దతు ఉండదని, కేశినేని నాని చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి వీరి మధ్య విబేధాలు రోడ్డెక్కుతున్నప్పటికీ, నాయకత్వం జోక్యం చేసుకోకపోవడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కార్యకర్తలు, నాయకుల మద్దతు మాత్రం కేశినేని నానికే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక గుంటూరు జిల్లాలో అగ్రనేతల మధ్య వెన్నుపోటు రాజకీయాలు, పార్టీకి ప్రమాదంగా మారాయని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకరిని ఓడించేందుకు మరొకరు ఇప్పటినుంచే, పావులు కదుపుతున్న వైనం చర్చనీయాంశమయింది. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు టికెట్‌ దక్కకుండా, ఆయన స్థానంలో డాక్టర్‌ చల్లగళ్ల శ్రీనివాస్‌ను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల తెరపైకి తెచ్చారంటున్నారు. ఇటీవల లోకేష్‌ పర్యటన సందర్భంగా చల్లగళ్ల శ్రీనివాస్‌ వేసిన ఫ్లెక్సీలో, యరపతినేని ఫొటో లేకపోవడం వివాదంగా మారింది.

పిడుగురాళ్లకు చెందిన వ్యాపారవేత్త, చింతలపూడి శ్రీనివాసరావును మరికొందరు ప్రోత్సహిస్తున్నారు. లోకేష్‌ను ఇటీవల చింతలపూడి భేటీ కావడంతో యరపతినేని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో చింతలపూడిపై యరపతినేని వర్గీయులు దాడి చేయటం, ఆయన యరపతినేని సహా ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసు పెట్టడం చకచకా జరిగిపోయాయి.

చింతలపూడి గతంలో జనసేన నుంచి పోటీ చేశారు. ఇప్పుడు యరపతినేనిపై ఇదే చింతలపూడి హత్యాయత్నం కేసు పెట్టడం గమనార్హం. ఆ కేసులో యర పతినేనిని ఏ-1గా పేర్కొన్న నేపథ్యంలో, ఆయన బెయిల్‌ తెచ్చుకున్నారు. పార్టీ-కార్యకర్తల కోసం పోరాడే యరపతినేని శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా గురజాలలో ముఠాలు డుతున్నా, నాయకత్వం స్పందించకపోవడంపై కార్యకర్తల్లో ఆగ్రహం-అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు వ్యతిరేకంగా, ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ను తెర వెనుక తెనాలికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రోత్సహిస్తున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల చంద్రబాబునాయుడు గుంటూరులో జరిగిన హాజరైన బట్టల పంపిణీ కార్యక్రమంలో, పలువురు మృతి చెందిన ఘటన తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని ఇదే ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు శ్రీనివాస్‌ నిర్వహించారు. కేవలం ఆయన వైఫల్యం వల్లే ఆ ఘటన జరిగిందన్న విమర్శ, పార్టీ వర్గాల్లో లేకపోలేదు. పార్టీ అధికారంలోకి వస్తే, మరొకరికి మంత్రి పదవి రాకుండా, అగ్రనేతలంతా ఇప్పటినుంచే ఒకరిని ఓడించేందుకు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలు, గుంటూరు జిల్లా పార్టీ వ ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండగా, నాలుగేళ్లపాటు వైసీపీని ఎదుర్కొని, రాజకీయంగా-ఆర్ధికంగా నష్టపోయిన తమకు వ్యతిరేకంగా, ఎన్‌ఆర్‌ఐలను తెరపైకి తీసుకురావడంపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం డబ్బుల ప్రాతిపదికన ఎన్‌ఆర్‌ఐలను తీసుకువస్తే, ఇక పార్టీకి చిత్తశుద్ధితో ఎందుకు పనిచేస్తారన్నది సీనియర్ల ప్రశ్న.

మరో ఏడాది ఎన్నికలు ఉన్నప్పటికీ.. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇన్చార్జిలు లేని వైనంపై, నాయకత్వం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో ఇన్చార్జిలపై స్పష్టత లేక, గందరగోళం నెలకొంది. కోడెల శివరాం నాయకతాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టికెట్‌ ఇస్తే ఓడించేందుకు సైతం వారు సిద్ధమవుతున్నారు.

దివంగత కోడెల శిప్రసాదరావు జీవించి ఉన్నప్పుడు ఆయన తనయుడు చేసిన వ్యవహారాలను జనం ఇంకా మర్చిపోలేదంటున్నారు. కొన్ని నియోజకవర్గాలకు టికెట్లు కూడా ముందస్తుగా ప్రకటిస్తున్న అధినేత చంద్రబాబునాయుడు.. నియోజకవర్గ ఇన్చార్జిలను మాత్రం, ఇప్పటిదాకా ప్రకటించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వంటి రిజర్వుడు నియోజకవర్గాల్లో, అగ్ర కుల నేతలను ఇన్చార్జిగా నియమిస్తున్న వైనంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎస్సీ నియోజకవర్గానికి కమ్మ వర్గానికి చెందిన మాకినేని పెద రత్తయ్యను ఎలా ఇన్చార్జిగా నియమిస్తారని దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు అన్ని దళిత నియోజకవర్గాల్లో, అగ్రకుల నేతల పెత్తనమే కొనసాగుతోందని గుర్తు చేస్తున్నారు.

ఇక మంగళగిరి పార్టీ ఆఫీసులో ఆత్మీవాతావరణం కనిపించడం లేదన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ టీడీపీ ఆఫీసులో స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండేదని, మంగళగిరిలో తలుపులు వేసుకుంటున్నారని ఓ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వ్యాఖ్యానించారు.

మంగళగిరి ఆఫీసు, పార్టీ కార్యాలయం మాదిరి కాకుండా ఐటి ఆఫీసుగా మారిందని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, మానవవనరుల వినియోగం వరకూ ఐటీ ఉపయోగపడుతున్నా. అది నేతలు-కార్యకర్తల మధ్య, మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయని ఓ మహిళా నేత వ్యాఖ్యానించారు.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్