వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా నల్గొండలో 70శాతం పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనేనని.. మూసీలో నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతుంటే ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేనని విరుకుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి చర్చ పెట్టండి సిద్ధమని సవాల్ విసిరారు.
హరీష్‌రావు మాట్లాడటంపై అభ్యంతరం తెలిపిన కోమటిరెడ్డి.. నువ్వు డిప్యూటీ లీడర్‌వా..? శాసనసభ్యుడివా అని ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏడాది కాలంగా అసెంబ్లీకి రాకపోవడం సభను అవమానించడమే కాదు.. తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉండి ఏనాడు SNBC సొరంగం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు హరీష్‌రావు. మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగే సంస్కృతి ఉండదన్నారు.