స్వతంత్ర వెబ్ డెస్క్: కులం, మతం పేరుతో దేశాన్ని విభజించాలని కేంద్రలోని బీజేపీ చూస్తోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు సెప్టెంబర్ 17 గాయాలు మానుతుంటే చిల్లర సినిమా తీస్తున్నారని, మానిన గాయాలను మళ్లీ రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతాల మంటల్లో చిచ్చుపెట్టి చలి కాగాలని బీజేపీ చూస్తోందని.. ఏదో రకంగా ప్రజల అటెన్షన్, డైవర్షన్ చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి కేటీఆర్ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రం ఏనాడూ తెలంగాణను ఆదుకోలేదని మంత్రి ధ్వజమెత్తారు. భద్రాచలం అయిదు మండలాలు ఏపీలో కలిపింది బీజేపేనని గుర్తు చేశారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం చట్టంలో పెట్టీ ఇప్పటికీ ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గుంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రూ.200 పెన్షన్ ఇవ్వలేనోళ్లు రూ. 4వేల పెన్షన్ ఎలా ఇస్తారని నిలదీశారు.