తెలంగాణ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చాలా ముందుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేక బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకుంది. ఆ తప్పును తాను ఏమాత్రం చేయకూడదని రేవంత్ సర్కార్ గట్టిగా భావిస్తోంది. అందుకే పార్టీలో, ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన కోసం సొంత ఎమ్మెల్యేల పనితీరుపై రహస్య సర్వేలకు తెరతీసింది. మూడో కంటికి తెలియకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీలతో పక్కా రిపోర్టులు తెప్పించుకుంటోంది. ఇంతకీ ఈ సీక్రెట్ సర్వేల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది? ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఫెయిల్ అయిన వారికి అదిష్టానం వేయబోయే శిక్ష ఏంటి?
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్ పైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక కేస్ స్టడీగా తీసుకుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దఫాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. దానికి తోడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆ పార్టీ సునాయాసంగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ, సెకండ్ టర్మ్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎమ్మెల్యేల వ్యవహారశైలి, అవినీతి ఆరోపణల కారణంగా వారిపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినా, సాహసం చేయలేక పాతవాళ్లకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఫలితంగా కేసీఆర్ సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సొంత పార్టీ నేతలపై ఉన్న వ్యతిరేకతే కొంపముంచిందని బీఆర్ఎస్ పెద్దలు సైతం పలు సందర్భాల్లో అంగీకరించారు. ఇప్పుడు ఈ చారిత్రక తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ కు పట్టిన గతి తమకు పట్టకూడదని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే కాంగ్రెస్ అలర్ట్ అయింది. పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత ప్రక్షాళనకు ఒక బలమైన పునాది వేస్తోంది.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు సర్వేలు చేయించుకుని అలెర్ట్ అవుతుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మూడేళ్ల ముందే పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకవైపు అధికార, ప్రతిపక్ష నేతల పర్యటనలు, మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. 2034 వరకు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, మరోసారి కాంగ్రెస్ అధికారం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి అత్యంత పోటీ వాతావరణంలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఏజెన్సీలతో సీక్రెట్ సర్వే చేయిస్తోంది. తమ ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం కూడా లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఈ బాధ్యతలు అప్పజెప్పింది. దాదాపు పది రోజులుగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సర్వే చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర గుబులు రేపుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు తన దగ్గరే ఉందంటూ రేవంత్ రెడ్డి గతంలో బహిరంగంగానే ప్రకటించారు. కొద్దిమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదని, వారు పద్ధతి మార్చుకోకపోతే ఆ రిపోర్టును నేరుగా వారికే అందజేస్తానని ఓపెన్ గానే హెచ్చరించారు. ప్రజలకు మరింత చేరువ కావాలని, నియోజకవర్గంలో నిత్యం విస్తృతంగా పర్యటించాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనితీరు మెరుగుపర్చుకోవాలని పదేపదే సూచించారు. కానీ ఇన్ని నెలలు గడుస్తున్నా కొంతమంది ఎమ్మెల్యేల తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అధిష్టానం గ్రహించింది. ఇటీవల జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో సైతం సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కొందరు నేతలు తమ నియోజకవర్గాల్లో జమీందార్లలా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారశైలి, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత వస్తుందో తెలుసుకునేందుకే పక్కా వ్యూహంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ రహస్య సర్వేలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలతో ప్రజల నాడిని పసిగడుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందుతున్నాయా లేదా అన్నది ప్రధానంగా ఆరా తీస్తున్నారు. పథకాలు అందుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల ప్రవర్తన లేదా అవినీతి కారణంగా ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తోందా అన్నది సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారా, ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా స్పందిస్తోందా అన్న అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఏ నియోజకవర్గంలోనైనా ప్రజల్లో అసంతృప్తి ఉంటే, దానికి అసలు కారణాలు ఏంటి, ఓవరాల్‌గా ఆ ప్రాంతంలో చక్కదిద్దుకోవాల్సిన అంశాలేంటి అనే డేటాను సేకరిస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి ఎమ్మెల్యే పనితీరుకు ప్రజల నుంచి మార్కులు వేయిస్తున్నారు. ఈ పకడ్బందీ నివేదిక ద్వారా పార్టీ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరుగుతున్న ఈ సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఐదు జిల్లాలతో పాటు త్వరలో రాష్ట్రమంతటా పూర్తి కానున్న ఈ సర్వే రిపోర్టులను నేరుగా హైకమాండ్ కు పంపనున్నారు. ఏ ఎమ్మెల్యే పనితీరు భేషుగ్గా ఉంది, ఎవరిది యావరేజ్ గా ఉంది, ఎవరి పనితీరు అస్సలు బాలేదు అనే అంశాల ఆధారంగా జాబితాలను వర్గీకరిస్తారు. ప్రోగ్రెస్ రిపోర్టులో బాగా వెనకబడిన ఎమ్మెల్యేలను స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి కలిసి పిలిపించుకుని మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారు. వారికి కౌన్సెలింగ్ తో పాటు ప్రత్యేకంగా ఒక ఓరియంటేషన్ నిర్వహించే అవకాశం ఉంది. సర్వే రిపోర్టులోని లోపాలను కళ్లకు కట్టినట్లు వివరించి, తమ పద్ధతి మార్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు వారికి ఒక స్పష్టమైన డెడ్ లైన్ ఇస్తారు. వాటన్నింటి తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు మరోమారు సరిగ్గా ఇలాంటి మెగా సర్వేనే నిర్వహించనున్నారు. ఆ ఫైనల్ రిపోర్టు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలా లేదా అన్నది అధిష్టానం నిర్దాక్షిణ్యంగా తేల్చేయనుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.


