సంక్రాంతి పండుగను సొంతూరు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్బంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి భూమిపూజ చేశారు.
నారావారిపల్లెలో రైతులకు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నారావారిపల్లెలో కేవలం డ్రిప్ ఇరిగేషన్‌తో వ్యవసాయం చేసేలా మోడల్ ప్రాజెక్టు రూపొందించాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు మైక్రో ఇరిగేషన్ మోడల్‌లో ఉండేలా చూడాలని డ్రోన్స్ కూడా వినియోగిస్తామని చంద్రబాబు అన్నారు. అగ్రికల్చర్‌తో పాటు హార్టీ కల్చర్ పంటలు కూడా ఉండాలని , ఈ ప్రాజెక్టును స్పెషల్ మోనటరింగ్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు సరకులు అందనున్నాయి. నారావారిపల్లెలో మహిళలకు చంద్రబాబు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో ఐక్యూ పెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నారు