గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 10వతేదీ వరకు నామినేషన్ల దాఖలు చేయాల్సి ఉండడంతో ఇక నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి కాబట్టి.. అభ్యర్థుల వేటలో పడ్డాయి ఆయా పార్టీలు. అలాగే ఆయా పార్టీల ఆశావహులు అధిష్టానం దగ్గర క్యూ కడుతున్నారు. తమకు సీటు దక్కేలా ఎవరికి తోచినంత వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు క్యూ కట్టారు.
రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో బిఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. దాదాపు 25 నుండి 30 మంది నేతలతో కేసీఆర్ భేటీ అవుతారట. కేసీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు కోరనున్నారు. బిఆర్ఎస్ పార్టీలో శేరి సుభాష్ రెడ్డి, మహముద్ అలీ, సత్యవతి రాధోడ్, యెగ్గె మల్లేశం ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. ఇక ఎమ్మెల్సీ పదవిపై ముఖ్య నేతలు సత్యవతి రాధోడ్, మాజీ మంత్రి జోగు రామన్న, దాసోజ్ శ్రావణ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బూడిద బిక్షమయ్య గౌడ్ కన్నేశారు. తనకు రెన్యువల్ కావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరుతున్నారట.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రేసులోకి బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కూడా వచ్చారట. సీనియర్ నేతలను కాదని అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేరుపై గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బీసీలకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ బీసీ నేతలు కోరుతున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీలో నిలబడే అవకాశం ఎవరికి రాబోతుందో.. వేచి చూడాలి