స్వతంత్ర వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎంపీపై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ గురించి నిర్వహించిన చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో కేంద్రమంత్రి వ్యక్తం చేశారు. సదరు ఎంపీని స్పీకర్ హెచ్చరించారు. అయితే ఆ బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై.. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళానికి దారి తీసింది. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న ప్రతిపక్షాలు.. వెంటనే ఆయనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తమ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్షాలు.. రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్ రమేష్ బిధురికి హెచ్చరికలు జారీ చేశారు.
లోక్‌సభలో శుక్రవారం చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌పై చర్చ చేపట్టారు. ఈ సంద్భంగా బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీ ఒక ఉగ్రవాది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం అయ్యాయి. అయితే రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలు తాను వినలేదని పేర్కొన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఒక వేళ ఆ వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగించేలా ఉంటే సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
విపక్షాల తీవ్ర నిరసనలతో బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బీజేపీ ఎంపీ రమేష్ బిధురి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని సభలో రగడ జరగడంతో స్పీకర్ స్పందించారు. సహచర సభ్యుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా బీజేపీ సభ్యుడు రమేష్ బిధురిని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
అయితే రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేస్తే సరిపోదని.. అతడ్ని సస్పెండ్ లేదా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. తమ నేత అధిర్ రంజన్ చౌదరీ.. కేంద్ర మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సస్పెండ్ చేశారని.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించింది. రమేష్ బిధురిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఏం చర్యలు చేపడతారో చెప్పాలని ట్విట్టర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింలు, ఓబీసీలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ బీజేపీ ఎంపీ పార్లమెంటులో స్పీకర్ ముందు ఈ మాటలతో మరో ముస్లిం ఎంపీని పిలవడం బిజెపి సంస్కృతి కాదా అని ప్రశ్నించింది. పార్లమెంటు చరిత్రలోనే ఇది చీకటి రోజు అని ఆ పార్టీ పేర్కొంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ ఉపయోగించిన మతపరమైన దూషణలకు తాను బాధపడ్డానని అన్నారు. నాకు బాధ కలిగింది కానీ ఆశ్చర్యం కలగలేదన్నారు. ఇది ప్రధానమంత్రి ‘వసుధైవ కుటుంబం’లో నిజం అన్నారు. పార్లమెంట్‌లో ఎంపీకి ఇలాంటి పదాలు వాడితే ముస్లింలకు, దళితులకు ఎలాంటి చట్టబద్ధత కల్పించారో ఆలోచించాలన్నారు.