స్వతంత్ర వెబ్ డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం మళ్లీ బట్టబయలైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోమటిరెడ్డి సోదరులు చెరో పార్టీలో ఉంటూ అన్న బీజేపీకి, తమ్ముడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా ఆ పార్టీలు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ బిడ్డను ఓడించాలని చూశాయన్నారు. ఆ రెండు పార్టీలకు సిద్ధాంతం లేదని, కాబట్టి ప్రజలు వారిని నమ్మరన్నారు. బీజేపీ పార్టీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నీరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీకి బలం అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారన్నారు మంత్రి హరీశ్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు తెలంగాణ శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషం చిమ్మే పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టే పార్టీ ప్రతిపక్షాలు అంటూ వ్యాఖ్యాంచారు. పొరపాటున కాంగ్రెస్‌కి ఓటేస్తే 60 ఏళ్ల కిందికి తెలంగాణ పోతుందన్నారు. మూడో సారి కేసీఆర్‌ను గెలిపించుకోకపోతే రాష్ట్రం ఆగం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.