తెలంగాణ పార్లమెంట్ పోరులో బీ టీమ్ మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీమ్ డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీటీమ్ ఆరోపణలు పార్లమెంట్ ఫైట్‌లో హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఎవరికి ఎవరు బీ టీమ్..? ఎవరికి ఎవరు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక మద్దతు ఇస్తున్నారు..? లోక్‌సభ ఎన్నికల వేళ సాగుతున్న పొలిటికల్ గేమ్‌లో నడుస్తున్నదేంటి..?
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర యమ రంజుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బీ టీమ్ మంటల రగడ మరింత రాజుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికార ఒప్పందం ఉందని… బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటును అస్త్రంగా మార్చుకున్న హస్తం నేతలు.. గులాబీ నేతలను బీజేపీ కాపాడే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా అదే పాట పాడుతోంది హస్తం పార్టీ. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రలను ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంగా ఈటలతో మల్లారెడ్డి సంభాషణపై నిలదీశారు. మల్లారెడ్డిపై పార్టీ పరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే ఈటలను కేసీఆర్ విమర్శించకపోవడం కూడా బీజేపీతో దోస్తానే కారణమన్నారు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసమే బీజేపీ కుట్రలను నిలదీయం లేదని ఫైర్ అయ్యారు.
ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే అదానీని కౌగిలించుకున్నారని.. మోదీని బడే భై అని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో వీక్ క్యాండిడేట్లను పెట్టి.. పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించారని మండిపడ్డారు. ఇప్పడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు కోసమే రేవంత్ తపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే డమ్మీ అభ్యర్థులను బరిలో దించారని ఆరోపించారు హరీష్‌రావు. అలాగే నామినేషన్లు రేపు అనగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం కూడా బీజేపీ విజయం కోసమేనని నిప్పులు చెరిగారు. ఇకపోతే బస్సుయాత్ర సందర్భంగా కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎవడు ఎవనికి బీ టీం అని ప్రశ్నిస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయి కాబట్టే.. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్‌ను దించేసి.. కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. మరోపక్క కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒక్కటేనని కమలనాథులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభా వేదికగా కేంద్రమంత్రి అమిత్‌షా ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే ధరణి, కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు అమిత్‌షా. ఆయనే కాదు.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా కమలనాథులందరి నోటి వెంట ఈ మాటే వినిపిస్తోంది.
తెలంగాణ పార్లమెంట్ ఫైట్‌లో బీ టీమ్ డైలాగ్ వార్ మరింత తీవ్రమైంది. ఈ డైలాగ్ లేకుండా ప్రచారం ముగించడం లేదు నాయకులు. దీంతో తెలంగాణ ప్రజానీకమంతా ఎవరికి ఎవరు బీ టీమ్, అసలు తెర వెనుక జరుగుతుంది ఏంటి..? కాంగ్రెస్ ఆరోపిస్తునట్టు కమలనాథులు, గులాబీ దళం ఒక్కటేనా..? లేదంటే బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాజకీయ చదరంగంలో కేవలం ఇవన్నీ ఆరోపణలేనా..? లేదంటే మద్దతు పాలిటిక్స్ నడుస్తున్నాయా అన్నది తేలాలంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలే సాక్ష్యాలుగా నిలుస్తాయం టున్నారు రాజకీయ నిపుణులు.


