ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలోని మన్యంలో అలజడి రేపింది. విశాఖలో పారిశ్రామిక వేత్తల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధికి 1/70 చట్టం ఆటంకంగా ఉందని సవరించడానికి అధికారులు లోతైన అధ్యాయం చేయాలని చెప్పారు. అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.
ఇక బుధవారం రవాణా వ్యవస్థను, విద్యాసంస్థలను మూసివేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కులకు పెట్టుబడులు పెట్టాలంటే 1/70 చట్ట సవరణ చేయాలని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర ద్రోహం చేయడమే అని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక ప్రభుత్వ విధానామా? వైఖరి స్పష్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.
1/70 చట్ట సవరణ చేయడమంటే అటవీ భూముల్ని ఇతరులకు అమ్మడానికి వెసులుబాటు కల్పించడమే.. ఇదే ఆదీవాసుల ఆందోళనకు ప్రధాన కారణమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కీలక కామెంట్స్ చేస్తే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే తమ పరిస్థితి ఏంటన్న భయం వారిని వెంటాడుతోంది.
అయితే 1/70 చట్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయమని మంత్రి ప్రకటించినా.. ఆదివాసీల్లో మాత్రం భయం పోలేదు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కోసం అధికారుల అండతో కాచుకుని ఉన్న మైనింగ్ మైఫియాపై గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల అనుమానాలకు ఇప్పుడు అయ్యన్న కామెంట్స్ బలం చేకూర్చాయి.
1/70 చట్టం ఏం చెబుతోంది?
భూమి బదలాయింపు చట్టం 1959ని 1970లో 1/70 చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషేధం. గిరిజనులు సభ్యులుగా ఉండే కో ఆపరేటివ్ సొసైటీకి తప్ప ఇతరులకు స్థిరాస్తిని అమ్మడం,. కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం వంటి బదలాయింపులు చేయకూడదు. 1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశ ఉంటుంది.