అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగుతోన్న నిరవధిక బంద్‌పై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడమంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా చేశామని గుర్తు చేవారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దు అయిందని, మళ్లీ ఆ జీవో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మన్యం జిల్లాలోని గిరిజనులు ఈ విషయంలో అనవసర అపోహలుతో ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసి వ్యాఖ్యలపై గిరిజన సంఘాలతో పాటు అఖిలపక్ష ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీతో పాటు మరికొన్ని గిరిజన తెగలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 48 గంటల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే.. ఈ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా తన మద్దతును ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి బంద్ ప్రకటించిన ప్రాంతాల్లో కొంతమంది తమ షాపులను స్వచ్ఛదంగా మూసివేశారు. జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల్లో నడుస్తున్న వాహనాలను సైతం గిరిజన సంఘాల నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు బంద్ నేపథ్యంలో అక్కడి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను సైతం వాయిదా వేశారు.