టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లతో పాటు కోయంబత్తూరులోనూ రెండు బృందాలతో పోలీసులు ఆర్జీవీ కోసం గాలిస్తున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ మార్ఫింగ్ పోటోలు పోస్టు చేసిన కేసులో పోలీసుల విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉంది. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. అయితే ఒక ప్రముఖ హీరో వర్మకు ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రామ్‌గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు నిన్న ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. ఉదయం నుంచి ఆర్జీవీ ఇంటి ముందే ఉన్న పోలీసులు..సెర్చ్ వారెంట్ లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయారు. సాయంత్రం వరకు వేచి చూసిన పోలీసులు చివరికి ఆర్జీవీని అరెస్ట్ చేయకుండానే వెళ్లిపోయారు.
అయితే ఈ వ్యవహారంపై ఆర్జీవీ లీగల్ టీం స్పందించింది. ఆయన వ్యక్తిగత విచారణకు హాజరు కాలేడని, వర్చ్యువల్ విచారణకు మాత్రమే హాజరవుతారని ఏపీ పోలీసులకు తెలిపింది. బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వర్చ్యువల్ గా కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉందని తెలిపింది. అయితే డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అర్జీవీ లీగల్ టీం స్పష్టం చేసింది.