స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామను సీఐడీ అదుపులోకి తీసుకున్న సమయంలో తక్షణమే కాల్ డేటా సేకరించాలని CBI అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు కాల్ డేటా ఉంటుందని.. ఈ కేసులో కాల్ డేటా ఎంతో కీలకమని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ వాదించారు.
ఇక సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదిస్తూ ఈ కేసు FIR సీఐడీ వద్దనే ఉంది కాబట్టి కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని తెలిపారు. సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ అధికారుల మీద అయితే కాల్ డేటా సేకరించాలని వారిని ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. మరోవైపు కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం చేపడతామని న్యాయస్థానం పేర్కొంది.