బీజేపీలో ఒక వర్గం పురందేశ్వరి తీరుపై ఆగ్రహం

    ఎంపీగా గెలిస్తే ఓకే! లేదంటే మాత్రం డౌటే! బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విషయంలో విన్పిస్తున్న కామెంట్లు ఇవి. చిన్నమ్మ రాజకీయాలతో ఏపీ ఎన్నికల్లో కమలం పార్టీలోని కొందరు కీలక నేతలకు సీట్లు దక్కకపోగా మరికొందరికి ఆశించిన స్థానాలు లభించలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో అవకాశం కోసం సీనియర్లు చాలా మంది వేచి చూస్తున్నారని, ఫలితాల్లో తేడా కొడితే మాత్రం పురందేశ్వరికి పదవి గండం తప్పదని చెబుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి? ఏపీ బీజేపీలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి పోలింగ్ వరకు ఏం జరిగింది ?

    పురందేశ్వరి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్‌. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆమె సొంతం. ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ప్రస్తుతం కమలం పార్టీకి ఏపీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈమె నేతృత్వంలోనే కాషాయ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు వెళ్లింది. జూన్ నాలుగున ఫలితాలు రానుండడంతో పురందేశ్వరి నేతృత్వంలో బీజేపీ ప్రభ వెలిగిపోయిందా లేదంటే మరింత దిగజారిందా అన్నది తేలిపోనుంది.

    పురందేశ్వరి సారథ్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే ఓకే, లేదంటే మాత్రం ఆమె రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇందుకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే, ఎన్నికల వేళ చిన్నమ్మ రాజకీయాలతో కమలం పార్టీలో ఉన్న రాష్ట్ర నేతల్లో పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయన్న వాదన బలంగా విన్పించింది. అప్పటివరకు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు నుంచి పార్టీ బాధ్యతలు అందుకున్న పురందేశ్వరి రాకతో ఏపీలో కమలనాథులు రెండు గ్రూపులుగా విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన వారెవరికైనా ఇది నిజమేనని అన్పించక మానని పరిస్థితి. ఇందుకు నిదర్శన మా అన్నట్లుగా పార్టీ పరంగా రాష్ట్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సోము వీర్రాజు నాయకత్వంలో పని చేసిన పలు జిల్లాలకు చెందిన అధ్యక్షులను మార్చేశారు. దీంతోపాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలను తొలగించి తన సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఇది ప్రతి అధ్యక్షులు చేసే పనే అయినా చిన్నమ్మ చూపిన రాజకీయ చాణక్యం మాత్రం మెల్లమెల్లగా మొదలై తారస్థాయికి చేరుకుందన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా విన్పించాయి.

    చివరకు ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. దీంతో పార్టీ కేడర్ కూడా ఉత్సాహంగానే స్పందిం చింది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. టీడీపీ అధినేతకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నారా లోకేష్‌ను స్వయంగా పురందేశ్వరి మధ్యవర్తిత్వం వహించి అమిత్ షాతో సమావేశం అయ్యేలా చేశారన్న ప్రచారమూ గట్టిగానే సాగింది. ఇక ఆ తర్వాతి పరిణామాల్లో రాష్ట్ర బీజేపీ నేతలు ఒంటరిపోరే మేలని అధిష్టానానికి విన్నవించినా, టీడీపీ, బీజీపీ, జనసేన పొత్తు కుదిరేందుకు తనవంతు సహకారం చిన్నమ్మ అందించా రన్నది కమలం పార్టీలోని కొందరు నేతలు చెప్పేమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే టికెట్ల కేటాయింపు లోనూ పురందేశ్వరి పోషించిన పాత్ర పలు విమర్శలకు దారి తీసిందన్న కామెంట్లు పార్టీ వర్గాల్లోనే విన్పిస్తు న్నాయి. వాస్తవానికి పొత్తు కుదిరిన తర్వాత దేశంలో బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా అలాగే టీడీపీ ఉన్న పరిస్థితుల ప్రభావం కారణంగా 25 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు సీట్లలో పోటీ చేయాలని రాష్ట్ర నేతలు కొందరు భావించారు. అధిష్టానాన్ని ఈ స్థాయిలో సీట్లు అడగాలని విజ్ఞప్తి చేశారు. కానీ, చివరకు కేవలం ఆరు లోక్‌సభా స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు.

    ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు చెప్పినట్లుగానే చిన్నమ్మ నడుచుకున్నారని, ఈ క్రమంలోనే అధిష్టానాన్నిసైతం తప్పుదారి పట్టించారని పార్టీకి చెందిన కొందరు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, సీట్ల విషయానికి వస్తే, ఓడిపోతారన్న సీట్లనే కమలానికి టీడీపీ అధినాయకత్వం కట్టబెట్టిందని, పురందేశ్వరి కేవలం తన ఎంపీ స్థానం మాత్రమే చూసుకున్నారని కొందరు నేతలు ఆరోపించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో ఎక్కువ సమయం ఉంటూ గత మూడేళ్లుగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న జీవీఎల్‌ నరసింహారావుకు చివరి నిమిషంలో మొండి చేయి ఎదురైంది. బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్ కోసమే జీవీఎల్‌కు వైజాగ్ ఎంపీ టికెట్ దక్కకుండా చిన్నమ్మ, చంద్రబాబు చేశారన్న విమర్శలున్నాయి. పోనీ విజయనగరం, అనకాపల్లి స్థానాల కోసమైనా జీవీఎల్ ప్రయత్నించినా కుదరని పరిస్థితి నెలకొంది. దీంతో.. ఇదంతా గమనించిన జీవీఎల్ ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.

   ఇక, అనకాపల్లి స్థానం నుంచి ఏకంగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌కు సీటు ఇవ్వడంతో ఇక్కడ్నుంచి పోటీ చేద్దామని భావించిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆశలు అడియాసలయ్యాయి. అంతేనా, రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. కానీ, ఆయనకూ ఝలక్ తప్పలేదు. దీంతో ఆ స్థానం నుంచి స్వయంగా పురందేశ్వరి బరిలో దిగడంతో మౌనంగా ఉండక తప్పలేదు సోమువీర్రాజుకు. అయితే, సోము వీర్రాజు కథ ఇక్కడితో ముగియలేదు. ఆయన్ను అనపర్తి నుంచి పోటీ చేయమని సూచించినా, ససేమీరా అని తిరస్కరించారు. ఇక, ఏలూరు లోక్‌సభా స్థానం కోసం దశాబ్ద కాలంగా బీజేపీలో పని చేస్తున్న తపనా చౌదరికి టికెట్ ఇప్పించడంలోనూ విఫలమయ్యారు పురందేశ్వరి. ఇక్కడ కూడా టీడీపీ పాగా వేసింది. కడప జిల్లాకు చెందిన యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌ను పోటీ చేయించింది. ఇక, హిందూపూర్ ఎంపీ సీటు లేదంటే కదిరి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన మరో సీనియర్ నేత విష్ణువర్థన్ రెడ్డికీ ఏదీ కాకుండా పోయింది. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు. ఏళ్ల తరబడి బీజేపీలో ఉంటూ వచ్చిన నేతల్లో పలువురికి టికెట్లు దక్కలేదంటే అందులో పురందేశ్వరి హస్తం ఉందన్న ప్రచారం కమలం శ్రేణుల్లో, నేతల్లో జోరుగా సాగుతోంది.

    టికెట్ల కేటాయింపులోనే కాదు. ప్రచారంలోనూ పురందేశ్వరి ఒంటెత్తు పోకడలు అవలంభించారన్న విమర్శలున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు ఆమె స్వయంగా బరిలో ఉన్న రాజమండ్రి ఎంపీ స్థానాన్నే తీసుకుంటే, పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎక్కడా కలుపుకోకుండా ఒంటరిగా వెళ్లారు చిన్నమ్మ అన్న కామెంట్లు విన్పించాయి. అందుకు నిదర్శనమా అన్నట్లుగా పురందేశ్వరి నామినేషన్ కార్యక్రమంలో మినహా మరెక్కడా కన్పించలేదు సోము వీర్రాజు. ఇలా ఒకటీ రెండూ కాదు. రాష్ట్ర బీజేపీలో పలువురు సీనియర్లు ఉన్నా, వారందర్నీ పక్కకు పెట్టి మరీ టీడీపీ, జనసేనతో పురందేశ్వరి అంటకాగారన్న విమర్శలూ పార్టీలోనే వ్యక్తమయ్యాయి. అయితే, పోలింగ్ ముగియడంతో ప్రస్తుతానికి పరిస్థితి అంతా మామూలుగా కన్పిస్తోంది. కానీ, జూన్ నాలుగున ఏపీ అసెంబ్లీ తోపాటు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ రిజల్ట్స్‌ కూటమికి సానుకూలంగా, బీజేపీకి కలిసి వచ్చేలా వస్తే రాష్ట్ర బీజేపీలో ఉన్న సీనియర్ల అంతా ఎవరికి వారు సర్థుకొని వెళతారు. అదే ఏ మాత్రం తేడా కొట్టినా అన్ని గళాలు ఒక్కతాటిపైకి వచ్చి పురందేశ్వరిపై విమర్శలు గుప్పించడం ఖాయ మన్న అభిప్రాయం కమలం నేతల్లో విన్పిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు కూటమికి సానుకూలంగా వస్తాయా ? బీజేపీకి ప్రభ పెంచుతాయా అంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్