ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగిందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎత్తు అనుకుంటే ఇటీవలె స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్‌రావు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌తో సీన్ మొత్తం మారిపోయిందన్న వాదన విన్పిస్తోంది. పైగా ఇందులో ఉన్న అంశాల్లో అప్పటి డీజీపీ, అదనపు డీజీల ప్రస్తావన రావడం మరింత సంచలనంగా మారింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు ఉంటాయన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గత కొన్ని రోజులుగా కుదిపేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. లోక్‌సభ ఎన్నికలతో ఈ అంశం కాస్త వెనక్కు పోయినట్లు కన్పించినా, ఇప్పుడు పోలింగ్ పూర్తవడం, ఫలితాలకు సమయం దగ్గర పడడంతో మళ్లీ మెల్లగా ఇది తెరపైకి వస్తోంది. ఇంకా చెప్పాలంటే జూన్ నాలుగు తర్వాత ఈ సెన్సేషనల్ కేసులో కీలక పరిణా మాలు, ఉన్నత స్థాయి వ్యక్తుల అరెస్టులు ఉండవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారన్న ఈ అంశంలో మొత్తం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఆధీనంలోనే, ఇదంతా జరిగిందని తేలింది. ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు దుగ్యాల ప్రణీత్ రావు, నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, పి. రాధాకిషన్ రావు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలంలో స్పష్టం చేసినట్లు ప్రచారం సాగింది.
ఎస్‌ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావే నేతృత్వం వహించినప్పటికీ ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోవైపు ఎస్‌ఐబీలో ప్రణీత్ రావు వార్ రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవి కావడం ఇక్కడ గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రబాకర్ రావును ఏ1గా, ప్రణీత్ రావు ఏ2గా, రాధాకిషన్ రావు ఏ3గా, భుజంగరావు ఏ4గా, తిరుపతన్న ఏ5గా, మరో వ్యక్తిని ఏ6గా చేర్చారు పోలీసులు. అనంతరం రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసులు ఇటీవలె అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. అయితే దీని కోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటీషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్ రావు ఓ అఫిడవిట్ దాఖలు చేయడం, అందులోని అంశాలు వెలుగు లోకి రావడం సరికొత్త సంచలనంగా మారింది.
అఫిడవిట్‌లో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానమని న్యాయ నిపుణులు చెబుతుండ డంతో ఈ అంశం మరింత సంచలనం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కేవలం పాత్రధారిని మాత్రమేనని, ట్యాపింగ్ వ్యవహారం అంతా అప్పటి డీజీపీలు, నిఘా విభాగ అధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్రభాకర్ రావు తన వాంగ్మూలం లో పేర్కొనడమే ఇందుకు కారణం.వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎలాంటి నిఘా పరికరాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌తోపాటు డీజీపీ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నిబంధనల్లో ఉండే అంశాలే. అయితే, ఇప్పటివరకు జరిగిన విచారణలో ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. దీంతో ఆయన పూర్తి గా తనకంటే పైన ఉన్న ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే తాను పనిచేశానంటూ చెప్పడంతో పరోక్షం గా వారి పాత్ర సైతం ఉందని చెప్పినట్లేనన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నాంపల్లి కోర్టులో దాఖలైన అఫిడవిట్‌ను పూర్తిగా ప్రభాకర్ రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు లాయర్లు. దీంతో రానున్న రోజుల్లో ఈ అంశంపై ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో పనిచేసిన డీజీపీలకు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న వాదన విన్పిస్తోంది. ఇక, టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి. రాధాకిషన్ రావు నేర అంగీ కార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషన ర్లుగా పనిచేసిన సీనియర్ పోలీసు అధికారుల నుంచి సైతం వాంగ్మూలం తీసుకోవడం తప్పనిసరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల టాస్క్‌లకు సంబంధించి తనకు అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్ రావు ఆ ప్రకారమే చేశారని తెలిపారు. ఇది కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
అటు అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్‌ఐబీ అధీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ చేసింది. అయితే, టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడడం, ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్క్‌ఫోర్సే నిర్వర్తించింది. ఈ విభాగం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమీషనర్ల నుంచి స్టేట్ మెంట్లు తీసుకోవడం తప్పనిసరన్న అభిప్రాయం విన్పిస్తోంది. వాస్తవానికి అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయగా మొన్నటి వరకు ఈ బృందం బంజారాహిల్స్ పీఎస్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పనిచేసిం ది. అయితే, తాజాగా దీన్ని జూబ్లీహిల్స్‌కు మార్చారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇలా ఒకదాని వెంట మరోటిగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, సార్వత్రిక ఎన్నికల వేళ స్తబ్దుగా ఉన్నట్లు కన్పించిన ఈ కేసు. ఫలితాల తర్వాత కీలక మలుపులు తిరగబోతోందన్న మాట విన్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే కొందరు మాజీ పోలీసు ఉన్నతాధికారుల అరెస్ట్‌లు సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ మెల్లగా మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైపుకు మళ్లింది.


