కేంద్ర మంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay Kumar) రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై బీజేపీ తెంలగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు( Ram Chander Rao) తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు అసలు ప్రజా సమస్యలపై మాట్లాడే పరిస్థితి లేక వ్యక్తిగత రాజకీయాలకు దిగిపోయారని విమర్శించారు.
రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి( Bharat Rashtra Samithi) నేతలు ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసులో చట్టపరంగా ముందుకు వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పు కాదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం దురదృష్టకరమన్నారు.
అలాగే బీఆర్ఎస్ హయాంలో మహిళలపై 23 వేల కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ, అప్పుడు నైతిక బాధ్యత పేరుతో ఎందుకు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ లిక్కర్ కేసులో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదని కూడా నిలదీశారు.
K T Rama Rao పై కూడా రామ్ చందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఫార్ములా ఈ-రేస్, Kaleshwaram Lift Irrigation Project వంటి అంశాల్లో అరెస్టు భయంతోనే కేటీఆర్ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
బండి సంజయ్ కుటుంబంతో పాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి లాగి రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.


