నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్‌ఆఫ్ ఇండియా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో నమోదైన కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. పీఎఫ్‌ఐ నార్త్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ సలీంను ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. కాగా… అబ్దుల్ సలీంను బెంగుళూరులోని రామేశ్వరం హోటల్ బాంబ్ బ్లాస్ట్‌లో నిందితుడిగా అనుమానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడేలా ముస్లిం యువతకు పీఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. దీంతో 2022 జులై 7న నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పీఎఫ్ఐ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా ఉండటంతో ఎన్‌ఐఏ కూడా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2022 డిసెంబర్‌లో చార్జిషీట్‌లో దాఖలు చేసి అందులో అబ్దుల్ సలీం సహా మొత్తం11 మంది నిందితుల పేర్లు చేర్చింది.


