రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో దస్తావేజు లేఖర్లు రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో కడప జిల్లా పులివెందులలో కూడా పెన్‌డౌన్ ఉద్యమం కొనసాగుతోంది. పులివెందుల సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద డాక్యుమెంట్ రైటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు పెన్‌డౌన్ సమ్మె కొనసాగుతుందని లేఖర్లు ప్రకటించారు. జీఓ 396ను వెంటనే రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్ చేపట్టారు. సత్తెనపల్లి రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద దస్తావేజు లేఖర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. దస్తావేజు లేఖర్లు ఈనెల 20 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ 396 వల్ల దస్తావేజు లేఖర్ల ఫ్యామిలీలు రోడ్డున పడతాయని లేఖర్ల అధ్యక్షుడు పోతంశెట్టి వెంకటేష్ అన్నారు. రిజిస్ట్రార్ ఆఫీస్ సేవా కేంద్రాలను వెంటనే నిలిపివేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని చిత్తూరు రిజిస్ట్రార్ ఆఫీస్ దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందని దస్తావేజు లేఖర్ల ప్రెసిడెంట్ శంకర్ అన్నారు. అందుకే పది రోజుల పెన్‌డౌన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తెచ్చిన 369 జీఓ వల్ల రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేట్‌పరం అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజల దస్తావేజులకు రక్షణ ఉండదన్నారు. పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు జిల్లా రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు.


