హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇంజినీర్లు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు. టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలుంటాయని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కృష్ణా నదీ జలాల మళ్లింపుపై సమావేశంలో చర్చించామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ చెప్పారు. 66:34 వాటాలను ఏడాది కోసమే ఒప్పుకున్నామన్నారు. సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ ఏపీకి ఇవ్వబోమని చెప్పామని తెలిపారు.
“కేఆర్‌ఎంబీ సమావేశంలో కృష్ణా నదీ జలాల మళ్లింపుపై చర్చించాము. 66:34 వాటాలను అప్పట్లో ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారు. తెలంగాణ, ఏపీకి 79 : 21 వాటాలను కేటాయించాలనేది తెలంగాణ హక్కు. అప్పటివరకు నదీ జలాల వాటాలను 50:50 ఇవ్వాలని కోరాము. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు ఛైర్మెన్ ఒప్పుకున్నారు. ఔట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయో తెలియాలి. 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని చెప్పాము. నదీ జలాల వాటాలకు సంబంధించి ఛైర్మెన్ ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది”.. అని రాహుల్ బొజ్జా అన్నారు
తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి ఇవ్వబోమని చెప్పామన్నారు. శ్రీశైలం డ్యాం సేఫ్టీ కోసం చర్చించామని వెల్లడించారు. నాగార్జున సాగర్ పర్యవేక్షణ నుంచి సీఆర్పీఎఫ్‌ను విరమించుకోమని కోరామన్నారు.
ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. గతంలో ఉన్న నీటి వాటాలను కొనసాగించాలని కోరామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 50:50 ఇవ్వాలని అడిగారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పాంజ్ పూల్ మరమత్తులు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుటుందని అడిగింది..ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పామని తెలిపారు.