ఇప్పుడు ఏపీ రాజకీయాలు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంని చేయాలన్న వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్నాయి. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని పలువురు టీడీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై జనసేన, టీడీపీ నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన హై కమాండ్ మంగళవారం స్పందించింది. ఇకపై ఈ అంశంపై ఎటువంటి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని తెలిపింది. పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని ప్రకటన విడుదల చేసింది.
ఇదే అంశంపై ఇప్పటికే టీడీపీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. లోకేశ్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.