అక్కడ రాజకీయ పార్టీల ప్రచారంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. అంతే క్షణాల్లో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అది తీవ్ర స్థాయికి వెళ్లిపోవడంతో ఇళ్లకి, వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. అంతే కాదు చేతికందిన కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
ఇదంతా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగింది. ప్రస్తుతం పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇళ్లకు గడియలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే…
టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహిస్తూ, ఇంటింటికి నాయకులతో తిరుగుతున్నారు. సరిగ్గా మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డుకి వచ్చేసరికి ఊహించని విధంగా ఘర్షణ మొదలైంది.
అది తీవ్ర రూపం దాల్చి బ్రహ్మారెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడులు చేశారు. ఆయన ఇంటికి, వాహనాలకి నిప్పు పెట్టారు. దీంతో బ్రహ్మారెడ్డిని హుటాహుటిన గుంటూరు తరలించారు. అనంతరం ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో మాచర్ల పట్టణంలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.
దాడి చేసిన వైసీపీ వర్గాలపై కేసులు పెట్టాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పల్నాడు అల్లర్లపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు, లోకేష్ ల కుట్రలో భాగమే మాచర్లలో మంటలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంఛార్జిగా బ్రహ్మారెడ్డి వచ్చిన దగ్గర నుంచి మాచర్లలో విధ్వంసాలు పెరిగిపోయాయని ఆరోపించారు.