- రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ
- బీఆర్ఎస్, సీపీఎం, వైఎస్ఆర్టీపీ పార్టీల ఫోకస్
- తెలంగాణ ఉద్యమం ప్రభావం అక్కడ అంతంతే.!
- గెలుపు కోసం ఇప్పటినుంచే నేతల క్యాంపెయిన్
పాలేరు… ఖమ్మం జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్. హేమాహేమీలు పాలేరులో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా…. ఇప్పటినుంచే పొలిటికల్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
పాలేరు జనరల్ స్థానం కావడంతో అందరి దృష్టి ఈ నియోజక వర్గంపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరలో ఉండటం…ఏపీ వాసులు చాలామంది పాలేరులో స్థిరపడ్డారు. నిజానికి గెలుపోటములను డిసైడ్ చేసేది వారే. దీంతో ఆంధ్రప్రదేశ్‌తో సంబంధాలున్న రాజకీయ నేతలు పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. వాస్తవానికి పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే. 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 2009, 2014లలో రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. ఆయన మృతితో 2016లో జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. రెండేళ్లకే జరిగిన జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరారు.
పాలేరు జనరల్ స్థానం కాబట్టి ఆర్థిక, అంగబలం ఉన్న నేతలు గెలుపుకోసం ఇప్పటినుంచే క్యాంపెయిన్ షురూ చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వర రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీరియస్‌గా దృష్టి సారించారు.
పాలేరు నియోజక వర్గంపై ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల పోటీ చేయడం ఖాయమైంది. శుక్రవారం ఆమె వైఎస్సార్‌టీపీ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భారీ బహిరంగ సభలోనూ పోటీ విషయమై స్పష్టతనిచ్చారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ చాలామంది ఇళ్లలో వైఎస్సార్ ఫోటోలు ఉంటాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్సార్ తెలంగాణ పార్టీకి మళ్లుతుందా…అనేదానిపై షర్మిల పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తుమ్మలను కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఉపేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తుమ్మలకు టిక్కెట్ దక్కుతుందా…లేదా..అనేది అనుమానమే. ఈ మధ్య ఆయన తన పాత తెలుగుదేశం మిత్రులతోనే ఎక్కువగా సమావేశమవుతూ ఉన్నారు. ఆయనను టిడిపిలోకి తిరిగి తీసుకునేలా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు కామ్రేడ్లు బాగానే పని చేశారు. లెఫ్ట్ పార్టీల మద్ధతు ను కంటిన్యూ చేయాలని బీఆర్‌ఎస్ ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పొటీకి నిలబడతారు. వీరితో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతాయి.
పాలేరు పాలిట్రిక్స్ మొత్తం తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. హేమాహేమీలు ఇక్కడ పోటీలో ఉంటుండటమే కారణం.