ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమమైన మహా కుంభమేళాకు సమయం ఆసన్నమైంది. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. మొత్తం 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తులతోపాటు సాధువులు, అఘోరీలు కూడా పాల్గొంటారు. చివరిసారిగా 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించారు. కాగా ఇప్పుడు 2025లో మహా కుంభమేళా నిర్వహించనున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. అనగా కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళాను నిర్వహిస్తారు.
మహా కుంభమేళా జరిగే అన్ని రోజులు…ఆ ప్రాంతం అంతా దైవ నామస్మరణతో మార్మోగుతుంది. ఈ అపురూప వేడుకను చూసి తరించడానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా నిర్వహణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎటువంటి లోపం జరగకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడం అలాగే వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ వసతుల కల్పన విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిగ్నానాన్ని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్లను కూడా ఉపయోగిస్తోంది యూపీ సర్కార్. మహా కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తు ప్రయాగ్‌రాజ్ కు వస్తారు. ఇలా వచ్చే భక్తుల మౌలిక వసతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది ప్రభుత్వం. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడానికి దాదాపు రెండు లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తోంది. మహా కుంభమేళా వేడుక కోసం దేశం నలుమూలల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక సంగమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతి కుంభమేళాకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వీటినే షాహీ స్నాన్ అని కూడా అంటారు. వివిధ అఖాడాల నుంచి భారీ సంఖ్యలో సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఈ సామూహిక స్నానాలకు ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయిస్తారు.
కుంభమేళా సమయంలో దేవుళ్లు , భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారంటున్నాయి పురాణాలు. గుప్తుల కాలంలోనూ కుంభమేళాలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. నడి ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు అప్పట్లో కూడా భారీ ఏర్పాట్లు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.