ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల బరులు సిద్ధమవుతున్నాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో కోడిపందాల నిర్వాహకులు బరితెగించారు. అధికార పార్టీ పేరుతో సంక్రాంతికి మూడు రోజులు ముందుగానే నియోజకవర్గంలోని భీమవరం, వీరవాసరం, తాడేరు, నౌడూర్లలో భారీ స్థాయిలో కోడిపందాలకు, జూదాలకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.
సంక్రాంతి సంబరాల పేరుతో ముందుగానే బరులు ఏర్పాటు చేస్తుండగా పోలీస్ యంత్రాంగం మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత వైసిపి ప్రభుత్వంలో సంక్రాంతికి రెండు రోజులు ముందుగా బరులు ఏర్పాట్లు చేసుకుంటే ఆనాడు పోలీసులు బరులను దున్నేసేవారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కడా పోలీసులు ముందుగా ఏర్పాటు అవుతున్న బరులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా చూస్తే వీరవాసరం మండలం నౌడూరులో సంక్రాంతి సంబరాలు పేరుతో బరులకు భారీ ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి మూడు రోజులపాటు ముందు సంబరాలు, వెనుక జూదాలు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. వీరవాసరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భీమవరం మండలం తాడేరు గ్రామంలో అయితే ఒక పెళ్లి విందు తరహాలో సెట్టింగ్ వేశారు. ఈ సెట్టింగ్ వెనుక ఉన్న గ్రౌండ్ ను కోడిపందాలకు జూదాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతికి మూడు రోజులు ముందే బరులు ఈ విధంగా ఉంటే సంక్రాంతి మూడు రోజులు పాటు ఏ విధంగా కోడిపందాలు, జుదాలు జరుగుతాయో ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది.