ఇద్దరి వైద్యుల్లో ఒకరు డ్రింక్ తాగడానికి వెళ్లి రక్తస్రావంతో మహిళ మరణానికి కారణమయ్యారని బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్లు చెల్లించాలని మలేషియాలోని క్లాంగ్ హైకోర్టు ఆదేశించింది. పునిత మోహన్ అనే మహిళ మరణానికి షాన్ క్లినిక్ బర్త్ సెంటర్‌లో విధుల్లో ఉన్న మునియాండి షణ్ముగం, అకాంబరం రవి అనే ఇద్దరు వైద్యులు, మరో ముగ్గురు నర్సులు బాధ్యత వహించాలని జడ్జిమెంట్ ఇచ్చింది. 2019లో, పునిత మోహన్ రెండవ బిడ్డను ప్రసవించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది.
రూ.11 కోట్ల నష్టపరిహారంలో చనిపోయిన మహిళ అనుభవించిన బాధకు, నొప్పులకు రూ.95 లక్షలు, ఆమె ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.1.9 కోట్లు, ఆమె తల్లిదండ్రులకు రూ.57 లక్షలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తీర్పును వెలువరుస్తూ, జస్టిస్ నార్లిజా ఒత్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ ప్రసవించిన తర్వాత తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా.. ఆమెను కాపాడడంలో ఇద్దరు వైద్యులు విఫలమయ్యారని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి క్లాలిఫై కాని నర్సులకు రోగి పరిస్థితిని పర్యవేక్షించే బాధత్యలు అప్పగించారని జస్టిస్ ఒత్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతురాలి తల్లి తన కుమార్తెకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించింది. నర్సులు కాటన్‌తో బ్లీడింగ్ ఆపేందుకు ప్రయత్నించారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్నందున తెంగ్కు అంపువాన్ రహిమా క్లాంగ్ (HTAR)కి తరలించారని.. తీర్పును చదివారు.
ఆమె పరిస్థితి విషమిస్తుందని ఇద్దరు వైద్యులు గుర్తించి వెంటనే HTAR ఆస్పత్రికి తరలించినట్టయితే మహిళ ప్రాణాలు పోయేదికాదని జస్టిస్ తెలిపారు.
నర్సుల పర్యవేక్షణలో మహిళను వదిలి డాక్టర్ రవి డ్రింక్ కోసం వెళ్లకుండా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతటి నిర్లక్ష్యం క్షమించరానిదని, ఓ తల్లి మరణానికి కారకులయ్యారని న్యాయమూర్తి అన్నారు. ప్రసవ సమయంలో వచ్చే సాధారణ సమస్యలను కూడా నివారించడంలో ఇద్దరు వైద్యులు పూర్తిగా విఫలమయ్యారని జస్టిస్ నార్లిజా ఒత్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.