ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని సొంత లైసెన్స్ పిస్టల్ ప్రమాదవశాత్తు పేలడంతో మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు.
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జస్కరన్ సింగ్ తేజ మాట్లాడుతూ.. గోగి తలకు బుల్లెట్ గాయాలయ్యాయని, అతన్ని స్థానిక దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని చెప్పారు.
గోగి ఇంట్లో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గోగి లైసెన్స్ డ్ పిస్టల్ నుంచి బుల్లెట్ పేలిందని తేజ తెలిపారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని జేసీపీ వివరించారు.
ప్రస్తుతం గోగి మృతదేహాన్ని డీఎంసీహెచ్ ఆస్పత్రి మార్చురీలో ఉంచామని.. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.
గురుప్రీత్ గోగి మృతితో రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లుథియానాలోని గోగి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
గోగి తన మరణానికి కొన్ని గంటల ముందు విధానసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ , ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ సీచెవాల్‌తో ‘బుద్ధ నల్ల’ను శుభ్రపరిచే అంశంపై సమావేశం నిర్వహించారు.