పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. పట్టణ సుందరీకరణ, అభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ అధికారులు షాపింగ్ ఏరియాను నేలమట్టం చేస్తున్నారు. నెల రోజుల నుంచి దఫా దఫాలుగా పట్టణంలోని వివిధ రకాల దుకాణ సముదాయాలను కూల్చివేస్తున్నారు. గోదావరిఖని పట్టణ చౌరస్తా పోచమ్మ మైదానం వద్ద ఉన్న షాప్‌లను కూల్చివేస్తున్నారు. ప్రత్యేక టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వ్యాపారాలను ఖాళీ చేయించి కూల్చివేస్తున్నారు.
అయితే చిరు వ్యాపారులు జేసీబీ యంత్రానికి అడ్డుపడి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డున పడేయడం సరైన విధానం కాదని అధికారులు, పాలకులపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించిన తర్వాతే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసుల బందోబస్తు మధ్య షాపులను కూల్చివేస్తున్నారు.