అధికారం దూరమైన తర్వాత బీఆర్ఎస్ నేతలను వరుస కేసులు ఇబ్బంది పెడుతున్నాయి. గత పదేళ్ల కాలంలో గులాబీ పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలలో ఉన్న లొసుగులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారాన్ని తెరపైకి తేవడం, అనంతర పరిణామాలు చోటు చేసుకోవడం అన్న మాట విన్పిస్తోంది.
తాను ఏ తప్పూ చేయలేదని, ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీసు కేసని చెబుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా జరిగిన విచారణలో కేటీఆర్‌ను సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగానే ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈనెల 16న ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు కేటీఆర్. ఈ మేరకు నోటీసులు అందించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
రేవంత్ సర్కారు దూకుడు చూస్తే.. ఈ రకమైన కేసులు కేటీఆర్ ఒక్కరితోనే ఆగవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న మాట విన్పిస్తోంది. ఈ క్రమంలోనే అందరికీ కన్పిస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు. ఇప్పటికే ఆయనపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే.. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు హరీష్‌రావు. కానీ, ఆయన్ను విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు హైకోర్ట్‌లో కౌంటర్ దాఖలు చేయడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్‌రావుపై భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదైంది. దీనిపై ఇద్దరూ హైకోర్ట్‌లో పిటీషన్ వేయగా ఊరట లభించింది. ఇక, హరీష్‌రావు తనపై ఆరు కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి కాకుండా చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్‌ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపైనా కమిషన్ నియమించారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కమిషన్ ఛైర్మన్… గులాబీ బాస్ కేసీఆర్‌కు గతంలోనే నోటీసులు పంపారు. దీనికి కేసీఆర్ లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. స్పాట్….
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావాలనే తమపై అక్రమంగా కేసులు బనాయిస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని.. చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతున్నారు. మరి.. గులాబీ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ఇంకా మరికొన్ని కేసులు నమోదవుతాయా..? నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న ప్రశ్న తలెతుత్తోంది.