35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా వారసత్వ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వ పోరు మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటే ఉత్తరాంధ్రలోనూ సీనియర్ నేతల వారసులు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో తీవ్రమైన పోటీ వల్ల టికెట్లు దక్కించుకోలేక వెనక్కి తగ్గిన యువ నేతలు.. వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. తండ్రుల రాజకీయ అనుభవానికి తోడు, యువతను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంతకీ ఉత్తరాంధ్రలో చక్రం తిప్పాలని చూస్తున్న ఈ వారసులకు ఆయా పార్టీల అధిష్టానాల నుంచి టికెట్లు ఖరారవుతాయా? తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈ యువ నాయకులు ప్రజల మద్దతును సాధించగలరా?

రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది సీనియర్ నాయకులు తమ కుటుంబాల నుంచి యువ నేతలను రాజకీయ రంగానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా ఈ వారసత్వ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. పార్టీ టికెట్ వస్తుందా రాదా అనే లెక్కలను పక్కనపెట్టి యువ నేతలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఇరు పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు తమ వారసులను బరిలోకి దించాలని భావించారు. కానీ అప్పట్లో ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు వారసులకు టికెట్లు ఇవ్వలేదు. దీనితో అప్పట్లో వారు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల నాటికి మాత్రం కచ్చితంగా తమ వారసులను బరిలో నిలపాలని సీనియర్లు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే తమ పిల్లలను నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో తిప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పరుచుకునే పనిలో పడ్డారు.

ఈ వారసత్వ రేసులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల విజయ్ అత్యంత దూకుడుగా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడైన విజయ్.. పార్టీలో ఒక సీనియర్ యువ నేతగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో, దానికి ముందు కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయ్‌కు టికెట్ ఇవ్వాల్సిందేనని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబడుతున్నారు. దీనికి తోడు విజయ్ ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ కోర్ టీమ్‌లో కూడా కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఆయనకు టికెట్ లభించడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణాలను గమనిస్తే విజయ్‌కు నర్సీపట్నంలో యువత ఫాలోయింగ్ బాగా పెరిగింది. దశాబ్దాలుగా అయ్యన్నపాత్రుడుకు ఉన్న బలమైన రాజకీయ వర్గం, ప్రజల్లో ఆయనకున్న సానుభూతి విజయ్‌కు పూర్తిగా అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలోనూ వారసత్వ చర్చ నడుస్తోంది. ఈ సారి తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ కచ్చితంగా పోటీ చేస్తారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘంటాపథంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే చిరంజీవికి టిక్కెట్టు ఇవ్వాలని సీతారాం అధిష్టానాన్ని కోరారు. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ జగన్ ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి సీతారామ్‌కే మళ్లీ టికెట్ కేటాయించారు. అయితే ప్రస్తుతం తాను వయోభారం, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నందున వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాగ్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని సీతారాం తేల్చేశారు. ఐటీ రంగంలో అపార అనుభవం ఉన్న చిరంజీవి గత రెండు ఎన్నికల్లో తండ్రి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటున్నారు. స్వయంగా యూట్యూబ్ చానల్స్ కూడా నిర్వహిస్తుండటంతో ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో యువ నాయకుడు కిడారి శ్రావణ్ కుమార్ ప్రస్థానం కాస్త భిన్నంగా సాగుతోంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావు.. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా కిడారి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సర్వేశ్వరరావు మృతి పట్ల ఉన్న సానుభూతితో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు శ్రావణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చారు. చట్టసభల్లో అంటే అటు అసెంబ్లీకి కానీ, ఇటు శాసన మండలికి కానీ సభ్యుడిగా లేకపోయినప్పటికీ శ్రావణ్ ఆరు మాసాల పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ హవా వల్ల శ్రావణ్ కుమార్ దారుణ పరాజయం పాలయ్యారు.

Latest Articles

అసోం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా

అసోం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గౌహతిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్