ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న సినిమా ఆస్కార్ నామినేషన్ లో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. అయితే పాటల విభాగంలో ‘నాటు-నాటు’ సాంగ్ నామినేషన్ కు ఎంపికైనట్టు ఆస్కార్ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు.
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల తరహాలో రెండు ఊహాజనితమైన క్యారెక్టర్లను ఊహించుకుని, వాటి చుట్టూ కథని నడిపి, దానికి స్వాతంత్ర సంగ్రామాన్ని నేపథ్యంగా ఎంచుకుని రాసుకున్న రాజమౌళి కథ రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ నామినేషన్ కు 81 పాటలు రాగా, అందులో 15 పాటలను ఎంపిక చేశారు. అందులో ఆర్ఆర్ఆర్ ఒకటి… తర్వాత వీటిలో ఐదింటిని ఫైనల్ గా ఎంపిక చేస్తారు. అనంతరం 2023 జనవరి 24న ఆస్కార్ అవార్డులు ప్రకటించేటప్పుడు ఈ ఐదింటిలో ఒక దానిని స్టేజి మీద ప్రకటిస్తారు. ఇదండీ సంగతి.
అకాడమీ అవార్డ్స్ నుంచి మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ఇస్తుంది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో 15పాటలను ఎంపిక చేసినట్టు ఆస్కార్ కమిటీ పేర్కొంది. ఇందులో ఆర్ ఆర్ఆర్ నిలవడంతో భారత సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘ స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా సంగీత విభాగంలో అర్హత సాధించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మంచి దర్శకుడు, మంచి సినిమా ఇలాంటి పెద్ద విభాగాల్లో నామినేట్ అయితే బాగుండేదని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తో పాటు షార్ట్ లిస్టులో మరో మూడు భారతీయ సినిమాలు కూడా ఎంపికయ్యాయి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ఛెల్లో షో (ద లాస్ట్ ఫిల్మ్ షో) ఎంపికైంది.
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ‘ఆల్ ది బ్రీత్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ద ఎలిఫాంట్ విప్పరర్స్’ చోటు దక్కించుకున్నాయి.