తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని, ప్రాణాలు తృణప్రాయంగా భావించి.. గుండెలు ఎదురొడ్డి నిలిచారని, ఆనాటి ప్రజా పోరాటాలు, త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో యోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని సర్మించుకుందామన్నారు. తెలంగాణ సాధనతో తన జన్మ సార్ధకమైందని, దేశం ఇప్పటికి కూడా ఆర్థికంగా వెనుకబడి ఉందన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని, తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వ్యవసాయానికి ఎంతో లబ్ధి చేకూరిందని, ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఆ పథకాన్ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో కరవును తరిమికొట్టామని, ఇప్పుడు పాలమూరు సస్యశ్యామలమవుతోందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, వరంగల్ జిల్లాకు కూడా అదనంగా సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, త్వరలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే అప్పర్ కృష్ణా, తుంగభద్ర.. భీమా ఎడమ కాలువ ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదన్నారు.
తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చామని, ఏటా 10 వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, లబ్దిదారుల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్లు పెంచామన్నారు. దేశంలో ఎక్కడ దళితబంధు పథకం లేదని, దళితబంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపామని, ఆదివాసీలకు పోడుభూముల పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.