మతాచార పండువలు, సదాచార సంప్రదాయలు.. ఆయా మతస్థులు, కులస్థులు వారి వారి ఆచార వ్యవహరాలకు అనుగుణంగా చేసుకుంటారు. ఒకరి పండువలకు ఒకరు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటారు. అయితే, జాతీయ పండువలు, దేశీయ పండువలు నిర్వహించుకునేది విడివిడిగా కాదు, సమష్టిగా, ఏకత్రాటిపై నిలిచి, ఏక బాటలో నడిచి…నేషనల్ ఫెస్టివల్స్ నిర్వహించుకుంటారు. జాతీయ పండుగల్లో ప్రధానమైనవి పంద్రహ్ ఆగస్ట్, రిపబ్లిక్ డే. దేశమాత దాస్యశృంఖలాలు తెంచి, భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు.. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఆగస్ట్ 15, 1947. నాటి నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక రెండో ప్రధానమైనది రిపబ్లిక్ డే. మన రాజ్యాంగం, మన ఇష్టాలు.. ఇలా దేశంలో అంతా మన అనగలిగిన రోజు జనవరి 26, 1950. ఆ ఏడాది ఈ రోజున మనకు సంపూర్ణ స్వరాజ్యం సిద్దించింది. దీనినే మనం గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డే నిర్వహించుకుంటున్నాం. రిపబ్లిక్ డే వేడుకలు దేశవ్యాప్తంగా రంగ రంగ వైభవంగా జరిగాయి. ఇక తెలంగాణలో అయితే….దావోస్ ఒప్పందాల దావో అన్న ఆహ్వాన పిలుపునకు పెట్టుబడుల వరద ప్రవహించిన రెండు రోజులకే రిపబ్లిక్ డే వేడుకలు వచ్చాయి. ఇక…రాష్ట్ర ప్రజలు, పాలకులు, ఆ పక్షాలు, ఈ పక్షాలు అనే బేధాలు లేకుండా అన్ని పక్షాలు, అధికారగణాలు…అంబరాన్నంటేలా రిపబ్లిక్ డే సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వైభవాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ఇక్కడి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతోందని అన్నారు. కాగా, జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
దేశ ప్రజలంతా ఏకమై ఒక సుస్థిరమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
స్వాతంత్ర్య ఫలాలు ప్రతి గడపకూ చేరాలని కోరుతూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలన్నారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ, స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారి పతాకవిష్కరణ చేశారు.
గణతంత్ర వేడుకలను సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఐ రాఘవేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మేధావులు, త్యాగధనుల కృషి ఫలితమే మనకు 1950 జనవరి 26న అతి పెద్ద రాజ్యాంగం ఏర్పడిందని సీఐ రాఘవేందర్ అన్నారు. భారత రాజ్యాంగ పౌరులుగా మనకు స్వేచ్ఛ, సమానత్వ హక్కులు ఉన్నాయని… వాటిని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంటుందన్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తార్నాక కార్యాలయంలో జాతీయ జెండాను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు ఆమె 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రజాపాలనలో 4 సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుండటంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతీపేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ నాచారం ఎర్రగుంటలో 76 గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు. నాచారం విలేజ్ నేతాజీ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక కార్యకర్త సోమ భావనగౌడ్ హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తొస్తారని ఆయన అన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను దేశ ప్రజలందరూ స్మరించుకుంటారని తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేతాజీ క్లబ్ కు సోమ భావన గౌడ్ 50వేల విరాళాన్ని అందజేస్తానని ప్రకటించారు
మేడ్చల్ మున్సిపాలిటీలోని వివేకానంద విగ్రహం పార్క్ వద్ద చైర్ పర్సన్ దీపికా రెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండావిష్కరణ కార్యక్రమంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. జాతీయ జెండాను తలకిందులుగా కట్టి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. తలకిందులుగా ఉన్న జెండాను గమనించి సరిచేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు హరివర్ధన్ రెడ్డి.
జనగాం జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగగా… జిల్లా పాలన అధికారి షేక్ రిజ్వాన్ భాష జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి దశలో తీసుకెళ్తున్నామని కలెక్టర్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. . తెలంగాణలో రైతన్న, నేతన్నలకు ఈ ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు 4.56 కోట్ల మీటర్ల చీరలతో పని కల్పించామని వెల్లడించారు.
——–