దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండుగా సాగాయి. న్యూఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు, ప్రాధాని మోదీ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.
మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి. తొలిసారి త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని ప్రదర్శించిడం విశేషం. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 31 శకటాలు ప్రదర్శించారు. దాదాపు అయిదు వేల మంది కళాకారులతో ప్రదర్శనలు చేశారు. వైమానికి విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేశాయి. ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్‌తో పలు శకటాలను రూపొందించారు. ఈ వేడుకల్లో బ్రహ్మాస్, ఆకాశ్ క్షిపణులతోపాటు పినపాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్యపథ్ లో తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ కవాతు కొనసాగింది.
అత్యంత దేశభక్తి ప్రదర్శిస్తూ దాదాపు 300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించారు. అనంతరం హెలికాప్టర్‌ల ఆకాశం నుంచి కురిసేలా ఏర్పాటు చేసిన పూల వర్షాన్ని చూసి చూపరులు ప్రశంసల జల్లులు కురిపించారు. గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ దీనికి నాయకత్వం వహించారు. ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నుంచి 152 మంది బృందం ఈ కవాతులో పాల్గొంది. మరో 190 మంది సభ్యుల బృందం మార్చ్ నిర్వహించింది. లెఫ్టినెంట్ అహాన్ కుమార్ నేతృత్వంలోని 61 మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది.
కర్తవ్యపథ్ చేరుకోవడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ప్రధాని మోదీ అనంతరం సైనికవందనం స్వీకరించారు. స్మారకం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు