గోదావరి… మహరాష్ట్రవాసులు గో అనే నదీమతల్లిని దా అని తెలంగాణవాసులు సాదరంగా ఆహ్వానిస్తుండగా..ఇక్కడి నేలను సుభిక్షం చేసి… వయ్యారంగా పరవళ్లు తొక్కుతూ.. ఆంధ్రప్రదేశ్ ను వరి పంటతో ధాన్యాగార రాష్ట్రంగా మార్చిన గోదావరి (గో, దా, వరి), కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార.. ఆదిగాగల నదీమ తల్లుల నీళ్లతో సుభిక్షంగా ఉండే గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశభక్తిలో పునీతమైన ఏపీ వాసులు ఘనంగా 76వ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్ లో గవర్నర్ జస్టీస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి లోకేశ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ సందేశంలో గవర్నర్ జస్టీస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రగతిని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా సర్కారు అడుగులు వేస్తోందని, ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలన్నది తమ నినాదమని చెప్పారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని గవర్నర్ నజీర్ చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్కారు పనిచేస్తోందని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర సర్కారు అన్నివిధాల సహకారం అందించడం సంతోషదాయకని అన్నారు.
రాష్ట్రంలో వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైయస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున ఈ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషదాయకమని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశంలో ప్రతి ఒక్కరి హక్కులను పరిరక్షిస్తూ దేశ సమగ్రతను కాపాడుతోందన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి అందరం పునర్ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఇదే రీతిలో రాష్ట్రంలోని వాడవాడలా రిపబ్లిక్ డే వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది. చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డ్ ఆయనను వరించింది. దీనిపై బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ ప్రయాణంలో తనతో పాటు నటించిన నటీనటులకు, సహకరించిన సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, యావత్ సినీ కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తనను ప్రోత్సహిస్తున్న తన అభిమానులకు, తనపై ఆదరాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని చెప్పారు. తనతో పాటు పద్మ అవార్డు పొందిన వారికి, ఇతర అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేస్తున్నానని నందమూరి బాలకృష్ణ తెలిపారు.