కొత్త ఏడాదిలో బిఆర్ఎస్ పార్టీ కొత్త కమిటీలు ఉంటాయా..? అధినేత కేసీఆర్ కమిటీల ఏర్పాటు పై కసరత్తులు చేస్తున్నారా..? కొత్త సంవత్సరంలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి వస్తారా…? ఇంతకు కొత్త కమిటీలపై బిఆర్ఎస్ పార్టీలో ఏం చర్చజరుగుతోంది…? కేసీఆర్ మదిలో ఏముంది..?
బీఆర్ఎస్‌లో కొత్త కమిటీల ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. వచ్చేఏడాదిలో కమీటీల ఏర్పాటు ఉంటుందని గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో కొత్త సంవత్సరంలో కొత్త కమిటీలతో అధినేత కేసీఆర్ ప్రజల ముందుకు వస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్నా.. కమీటీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గులాబీ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో కమిటీల ఏర్పాటుపై నిర్ణయం వెలువడచ్చని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పది అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించాల్సి ఉంది. అలాగే పార్టీ అనుబంధ విభాగాలకు కమిటీలను ప్రకటించాల్సి ఉంది. అనుబంధ విభాగాల కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళడంలేదని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ భవన్ లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని అగ్ర నేతలు భరోసా ఇచ్చారు. అయితే ఏడాది పూర్తి అయినా పార్టీ కమీటీలపై ఊసే లేదని గులాబీ పార్టీ కేడర్‌లో అంతర్గతంగా చర్చజరుగుతోంది.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్మాణంపై దృష్టి పెట్టకపోతే పార్టీ బలోపేతం కావడం కష్టం అనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తం అవుతోంది. దీంతో పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అంశంపై కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి రాష్ట్ర కమిటీ కూర్పు ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై గులాబీ నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్. మరి ఈ సారి జిల్లా అధ్యక్ష పదవులను ఎవరికి ఇస్తారు అనే దానిపై చర్చనడుస్తోంది.
బీఆర్‌ఎస్ 2022 జనవరి 26న జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. జిల్లా అధ్యక్షుల నియామకాలను సైతం చాలా కాలం వాయిదా వేసిన కేసీఆర్ ఎట్టకేలకు 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి కార్యవర్గం లేదు. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించాలని, లేనిపక్షంలో కనీసం పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని జిల్లా అధ్యక్షులు అధినేతను కోరారు. అయితే అధిష్టానం మాత్రం ఇంతకాలం జిల్లా అధ్యక్షులతోనే నెట్టుకొని వచ్చింది. బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత కూడా సంస్థాగత పదవులు పొందలేకపోయామని ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి ఉంది. అయితే సంక్రాంతి తర్వాత కొత్త కమిటీల నియామకం ఉంటుందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ కొత్త సంవత్సరం ప్రజల్లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీలో కొత్త కమిటీలను నియమిస్తారో లేదో వేచి చూడాలి.