బీహార్‌లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అభ్యర్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
BPSC ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో ఉద్రిక్తతలకు దారి చేసింది. నిన్న వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
అంతకుముందు.. విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. అయితే, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. తమ మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.