ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారని కడిగిపారేశారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శించాల్సింది కదా.. అలా వెళ్లకుండా ఇంత దూరం తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడని ప్రశంసించారు.
రేవంత్ రెడ్డి కష్టపడి కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో ఆయన వ్యవహరించలేదని అన్నారు. సినిమాల బెనిఫిట్‌షోలకు అవకాశమిచ్చారు. టికెట్ ధర పెంచుకోవడానికి కూడా అవకాశమిచ్చారు. రేవంత్ సహకారంతోనే సినిమాల కలెక్షన్లు బాగా పెరిగాయి. సలార్ , పుష్ప2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు రావడానికి కూడా ఒక రకంగా రేవంతే కారణమని చెప్పారు. పుష్ప2 సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది కాదా అని పవన్ అన్నారు. అల్లు అర్జున్ విషయంలో అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానమే. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేను. భద్రత గురించే పోలీసులు ఆలోచిస్తారు. సెక్యూరిటీకి సంబంధించి థియేటర్ సిబ్బంది కూడా అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ అన్నారు. పోనీ, సీట్లో ఆయన కూర్చొన్నాక అయినా, చెప్పి అల్లు అర్జున్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాల్సింది కదా అని పవన్ కొద్దిగా ఘాటుగానే స్పందించారు.
అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం తనను బాధించిందని చెప్పారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. బాధిత కుటుంబానికి అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది కదా అంటూ చురకలంటించారు. మా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేసి ఉండాల్సింది కాదా .. ఇందులో ఎక్కడా మనవతా దృక్పథం కనిపించలేదని అన్నారు. అందరూ వెళ్లి చనిపోయిన రేవతి కుటుంబానికి మేము ఉన్నామనే భరోసా ఇచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడమే ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. సినిమా టీమ్ అందరిదీ బాధ్యతే.. అంతేకానీ ఒక్క అల్లు అర్జున్‌దే తప్పని అనడానికి వీల్లేదని పవన్ అన్నారు. ఘటన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించడం కరక్టే కదా.. అంటూ చెప్పుకొచ్చారు. గతంలోనూ చాలా మంది హీరోలు సినిమా చూడటానికి వెళ్లే వారని.. అంతెందుకు చిరంజీవి కూడా సినిమాలు థియేటర్‌కు వెళ్లి చూశారని.. అయితే వారందరూ కూడా ముసుగు వేసుకుని వెళ్లారని చెప్పారు. అందుకే ఇలాంటి ఘటనలు జరగలేదని.. ఓ రకంగా అల్లు అర్జున్ కూడా సినిమా చూడాలనుకుంటే ముసుగు వేసుకుని ఒక్కడే వెళ్లి చూస్తే బాగుండన్నట్లు సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్