మిత్రులుగా ఉన్న రెండు పార్టీల మధ్య ఇప్పుడు శత్రుత్వం పెరిగిందా…? ఆ పార్టీ అధినేత కామెంట్స్ అందులో భాగంగానే చేశారా…? ఇంతకు ఆ రెండు పార్టీలు ఏంటి…? రెండు పార్టీల మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం ఏంటి…? దీనిపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?
బిఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు ఒకప్పుడు మిత్రులు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు రివర్స్. రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం గులాబీ పార్టీకి దగ్గర అయింది. ఇక బిఆర్ఎస్ పార్టీతో కలిసి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం దోస్తీ చేస్తుంది. ఇక పాతబస్తీతో పాటు హైదరాబాద్ నగరంలో ఎం.ఐ.ఎం ప్రభావం చూపుతూ వస్తోంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు సైతం ఎంఐఎంతో దోస్తీ చేస్తాయి. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో దోస్తీ చేసింది. స్వయంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ప్రకటించారు. దీంతో ఎంఐఎం సైతం బిఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరిగింది.
ఇక బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లల్లో ఎం.ఐ.ఎం పార్టీ పాతబస్తీ బయట పోటీ చేయలేదు. తమ ఏడు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్ లో ఎంఐఎం పోటీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న మిలిగిన స్థానాలతో పాటు రాష్ట్రంలో తమ మైనారిటీ ఓటు బ్యాంకును గులాబీ పార్టీకి ట్రాన్స్‌ఫర్ చేసింది. కారు స్టీరింగ్ తమ చేతిలోనే ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను గులాబీ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను గెలుచుకోవడానికి ఎంఐఎం సహకారం అందించింది. ఎంఐఎం పార్టీ పోటీ చేసిన అసెంబ్లీ స్థానాల్లోను బిఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా పోటీకి అభ్యర్థులను బరిలోకి దింపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఎంఐఎం దూరం అయినట్లుగా చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం దోస్తీ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ పలుసార్లు కలిశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పాతబస్తీ అభివృద్ధిపై ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మూసీ అభివృద్ధిని ఎంఐఎం స్వాగతిస్తోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నష్ట పరిహారం ఇవ్వడంపై సానుకూలంగా ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేస్తుందని కామెంట్స్ చేశారు.
తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గులాబీ పార్టీపై చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై గులాబీ పార్టీ చేస్తున్న ఆరోపణలపై అసదుద్దీన్ స్పందించారు. ఈ అంశంపై కేటీఆర్ టార్గెట్ గా అసదుద్దీన్ విమర్శలు చేశారు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీని నడుపుతున్న వారికి జ్ఞాపక శక్తి లేదు అని అన్నారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మసిఉల్లా ఖాన్ కుమారుడి విషయంలో వచ్చిన ఆరోపణలపై కేటీఆర్ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీంతో ఎంఐఎం, బిఆర్ఎస్ పార్టీ మధ్య గ్యాప్ ఉందనే విషయంపై మరోసారి క్లారిటీ వచ్చింది.
మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు ఉండరు అనే అంశం ఎంఐఎం పార్టీ రూపంలో మరోసారి స్పష్టం అయింది.


